Forest Officer Died : గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ అధికారి మృతి.. రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్
22 November 2022, 20:35 IST
- Telangana Crime News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోయారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు.
సీఎం కేసీఆర్
ఫారెస్ట్ అధికారి(Forest Officer)పై గుత్తికోయలు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోడు భూములకు(Podu Lands) సంబంధించి.. గుత్తికోయలు, ఫారెస్ట్ ఆఫీసర్స్ మధ్య వివాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సమయంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ ను గుత్తికోయలు వెంటాడారు. మెుదట ఆయనపై కర్రతో దాడి చేశారు. దీంతో కిందపడిపోయారు. వెంటనే.. వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు.
ఈ ఘటన గురించి తెలిసి.. వెంటనే.. హుటాహుటిన డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ వసంత్ కుమార్ చండ్రుగొండ(Chandrugonda) చేరుకున్నారు. అప్పటికే తీవ్ర గాయాలతో శ్రీనివాస్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆయనను స్థానిక పీహెచ్ సీ తరలించారు. పరిస్థితి విషమించగా.. ఖమ్మం ఆసుపత్రికి(Khamma Hospital) తరలించగా.. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు.
కొన్ని రోజులుగా ఫారెస్ట్ అధికారులు, ఆదివాసులకు నడుమ పోడు భూముల విషయంలో వివాదం నడుస్తోంది. బెండలపాడు సమీపంలో ఎర్రబొడు అటవీ ప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు.. మెుక్కలు నాటారు. వాటిని గుత్తికోయలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయంపై వివాదం నడుస్తోంది. ఫారెస్ట్ అధికారులు.. ప్లాంటేషన్(Plantation) చేయడాన్ని నిరసిస్తూ.. మళ్లీ భూముల్లోకి వచ్చారు కోయలు. మెుక్కలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే గొడవ జరిగి.. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై దాడి చేయగా ఆయన మృతి చెందారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) స్పందించారు. గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ(DGP) మహేందర్ రెడ్డిని ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్వో(FRO) కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏవిధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలన్నారు. రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు . ఎఫ్ఆర్వో పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar)ను ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎఫ్ఆర్వో అంత్యక్రియల్లో పాల్గొని ఏర్పాట్లు చూసుకోవాలని కేసీఆర్ చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని కేసీఆర్ చెప్పారు