KCR : ప్రభాకర్ రెడ్డిపై దాడి అంటే నాపై జరిగినట్లే - కేసీఆర్ సీరియస్ వార్నింగ్
30 October 2023, 16:22 IST
- Attacked MP Kotha Prabhakar Reddy Updates: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరగటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులను సహించేదే లేదని వ్యాఖ్యానించారు. హింసతో ఏం సాధించలేరని అన్నారు.
సీఎం కేసీఆర్
Attacked MP Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు.
“ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయటమంటే నాపై దాడి జరిగినట్లే. ఇలాంటి దాడులు చేయడం మాకు చేతకాదా..? తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వాటిని సహించేదే లేదు.ఎన్నికలు ఎదుర్కోలేక దాడులు చేస్తారా..? మేం కత్తులు పట్టుకోలేమా..? మేం అదే తరహాలో ఆలోచిస్తే ఏం ఉండదు. మా సహనాన్ని పరీక్షించవద్దు. ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో నా మనసు బాగులేదు" అని కేసీఆర్ కామెంట్స్ చేశారు.
నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… దాడి ఘటనపై మంత్రి హరీశ్ రావు ను సీఎం ఫోన్లోఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఎంపీపై కత్తితో దాడి…
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగింది. చెప్పాలా గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి హరీశ్ రావు. ప్రభాకర్ రెడ్డి పై దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యం లో హింస కు తావు లేదని.. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డి కి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించామని… కత్తిపోటు తో కడుపులో గాయాలయ్యాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ,బీ ఆర్ ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని….అధైర్య పడవద్దని సూచించారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.