CM KCR | దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా వెళ్తున్నా.. చివరి రక్తం బొట్టు వరకు పోరడతా
23 February 2022, 15:52 IST
- తెలంగాణ జల కిరీటం.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్
సిద్దిపేటలో జిల్లాలోని మల్లన్నసాగర్ వద్ద అద్భుత దృశ్యం ఆవిశ్కృతమైంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం తర్వాత.. విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టును కేసీఆర్ పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దది మల్లన్నసాగర్ జలాశయమే. 50 టీఎంసీల సామర్థ్యంతో... 15.70 లక్షల ఎకరాలకు నీటిని అందించనుంది. హైదరాబాద్‌కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశం ఉంది.
ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అడ్డుకునేందుకు చాలా దుష్టశక్తులు పని చేశాయన్నారు. సుమారు 600కు పైగా కేసులు వేశారని తెలిపారు. మనం కలలు కన్న తెలంగాణ నేడు సాకారమయిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్న సాగర్ అని తెలిపారు. ఈ జలాశయాన్ని ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టం అన్నారు. ఈ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు.
మల్లన్నసాగర్ కాదు.. తెలంగాణ జలసాగర్
మల్లన్నసాగర్‌లో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది. వారికి నా ధన్యవాదాలు. ఇది మల్లన్న సాగర్.. కాదు.. తెలంగాణ జలసాగర్. పరిహారం అందని వారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చూస్తాను. పాలమూరు జిల్లాలో కూడా మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులు ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు.. హైదరాబాద్ మహానగరానికి శాశ్వత తాగు నీటి సమస్యను పరిష్కరించే ప్రాజెక్టు. సుమారు 20 లక్షల ఎకరాలను కడుపులో పెట్టుకుని కాపాడే.. ప్రాజెక్టు మల్లన్నసాగర్. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు.
- సీఎం కేసీఆర్
దేశం అబ్బురపడేలా తెలంగాణ ఆవిష్కృతమైందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు చాలా వరకు తగ్గాయని తెలిపారు. పది లక్షల పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్లు చేశామన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో పురోగతి సాధించామని తెలిపారు. దేశం దారితప్పిపోతోందని కేసీఆర్ అన్నారు. దేశం జుగుప్సాకరమైన పనులు జరుగుతున్నాయని.., కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారన్నారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నుంచి రూ.1.5 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు అవుతున్నాయన్నారు. విమానాశ్రయం నాలుగో లార్జెస్ట్ డెస్టినేషన్‌గా నిలిచిందని కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశంగా వెళ్తున్నాని.. చివరి రక్తం బొట్టు వరకు పోరాడతానని కేసీఆర్ అన్నారు.
రూ.1500 కోట్లతో టూరిజం కేంద్రాలు
మల్లన్నసాగర్‌తో పాటు కొండపోచమ్మసాగర్.., ఇతర ప్రాజెక్టుల వద్ద టూరిజం అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం 1500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తానని వేదిక మీద ప్రకటించారు. ఈ టూరిజం స్పాట్ ప్రపంచ దేశాలను ఆకర్షించేవిధంగా తీర్చిదిద్దాలని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్.. అన్ని ఇక్కడికే వచ్చేలా ఉండాలన్నారు. సింగపూర్ కు ఇక్కడి వాళ్లు.. వెళ్లేడం కాదు.. వాళ్లే.. ఇక్కడి వచ్చేలా ప్లాన్ చేద్దామని సీఎం అన్నారు.