తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad : రూ.60 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం..! తెరపైకి బోధన్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ పేరు..?

Nizamabad : రూ.60 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం..! తెరపైకి బోధన్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ పేరు..?

HT Telugu Desk HT Telugu

17 December 2023, 6:58 IST

google News
    • Custom Milling Rice : నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీని విలువ సుమారు రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఫ్యామిలీ పేర్లు తెరపైకి వచ్చాయి.
రూ.60 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం..!
రూ.60 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం..! (Twitter)

రూ.60 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం..!

Bodhan EX MLA Shakeel: అధికారం అడ్డుపెట్ట‌కుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవ‌క‌త‌వ‌క‌లు, అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి `జీవ‌న్ మాల్‌` తతాంగం మ‌ర‌వ‌క‌ముందే.. ఈసారి బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అమేర్ సీఎంఆర్ బియ్యం స్కాం బ‌య‌ట‌ప‌డింది. 2021-22 యాసంగితో పాటు 2022-23 వానాకాలానికి సంబంధించి 35 వేల మెట్రిక్ ట‌న్నుల బియ్యం పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు తిరిగి ఇవ్వాలేద‌ని బ‌య‌ట‌ప‌డింది. ఈ బియ్యం విలువ రూ.60 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఈ రూ.60 కోట్ల‌తో పాటు సీఎంఆర్ బియ్యం తిరిగి ఇవ్వ‌నందుకు విధించిన జ‌రిమానా కింద మ‌రో రూ.10 కోట్లు కూడా చెల్లించాల్సి ఉంది. ఇవేవీ చెల్లించ‌క‌పోవ‌డంతో మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన రైస్ మిల్లుల్లో సివిల్ స‌ప్ల‌య్ అధికారులు త‌నిఖీలు చేప‌డుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఈ అంశాన్ని బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ యెండ‌ల ల‌క్ష్మినారాయ‌ణ‌తో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షులు మానాల మోహ‌న్‌రెడ్డి లేవ‌నెత్తారు. ష‌కీల్ అమేర్ భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

అధికారుల తనిఖీలు...

బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అమేర్ కు సంబంధించిన మిల్లుల్లో అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. బోధ‌న్ డివిజ‌న్‌లోని సాలురా మండ‌లం త‌గ్గెలి గ్రామ స‌మీపంలోని ఆయ‌న‌కు సంబంధించిన మిల్లుల్లో గ‌త రెండు, మూడు రోజుల‌గా త‌నిఖీలు చేప‌డుతున్నారు. యాసంగి, వానాకాలానికి సంబంధించి ష‌కీల్ అమేర్‌కు సంబంధించిన మిల్లుకు 50 వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు కేటాయించారు. ఇందులో నుంచి 35 వేల మెట్రిక్ ట‌న్నుల సీఎంఆర్ బియ్యం తిరిగి మిల్లు నుంచి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు కేటాయించాలి. కానీ కేవ‌లం 5 వేల మెట్రిక్ ట‌న్నుల బియ్యం మాత్ర‌మే తిరిగి చెల్లించారు. అయితే ధాన్యం మిల్లింగ్ త‌న మిల్లుతో సాధ్య‌ప‌డ‌దని, ఈ ధాన్యాన్ని మ‌రో నాలుగు మిల్లుల‌కు పంపి సీఎంఆర్ బియ్యంగా ఇస్తాన‌ని సివిల్ స‌ప్ల‌య్ అధికారుల‌కు లిఖిత‌పూర్వ‌కంగా రాసి ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అందులో నుంచి కేవ‌లం 4 వేల మెట్రిక్ ట‌న్నుల బియ్యం మాత్ర‌మే తిరిగి ఇచ్చారు. ఇదేంట‌ని మిగిలిన నాలుగు మిల్లుల‌కు బియ్యం గురించి అధికారులు అడ‌గ్గా.. షకీల్ కు సంబంధించిన మిల్లుల నుండి త‌మ‌కు ఎలాంటి ధాన్యం రాలేదని, ఆయన ఒత్తిడి మేరకే తాము ధాన్యం తీసుకున్నట్లు లేఖ ఇచ్చామ‌ని వాపోయార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో సివిల్ స‌ప్ల‌య్ అధికారులు త‌నిఖీలు చేప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ష‌కీల్ అమేర్ బోధ‌న్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బోధ‌న్ నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కులు సుద‌ర్శ‌న్‌రెడ్డి గెలుపొందారు.

నిజామాబాద్ జిల్లాలో ధాన్యం దందా కొన‌సాగుతోంద‌ని మొద‌టి నుంచి పెద్దఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప‌లుమార్లు ఎంపీ అర‌వింద్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి కూడా ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. ధాన్యం కొనుగోళ్ల‌లో వంద‌ల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని వాపోయారు. కానీ ఏనాడూ విచార‌ణ చేప‌ట్ట‌లేదు.

అయితే ఈ తనిఖీల విషయంలో షకీల్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ… బియ్యాన్ని తాము దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అధికారులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సమర్పించే బియ్యాన్ని అందజేశామని తెలిపారు. ఇదంతా కూడా రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా చేస్తున్నారని కామెంట్స్ చేశారు.

రిపోర్టింగ్: నిజామాబాద్ ప్రతినిధి

తదుపరి వ్యాసం