Mla Wife Suicide: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య
21 June 2024, 6:16 IST
- Mla Wife Suicide: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆత్మహత్యకు పాల్పడిన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి
Mla Wife Suicide: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజక వర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి గురువారం రాత్రి హైదరాబాద్‌లో తాము ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం అర్ధరాత్రి దాటిన తర్వాత వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్‌లో ఎమ్మెల్యే కుటుంబం నివాసం ఉంటోంది. ఆల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో రూపాదేవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని బంధువులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూపాదేవి రెండు రోజులుగా పాఠశాల విధులకు వెళ్లడం లేదు. ఎమ్మెల్యే సత్యం గురువారం ఉదయం చొప్పదండికి వెళ్లారు. సాయంత్రం వరకు నియోజక వర్గంలోనే ఉన్నారు.
ఎమ్మెల్యే కుటుంబం బంధువులతో కలిసి కొద్ది రోజుల క్రితం తిరుమలతో పాటు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.