Chandrababu On Gaddar: గద్దర్ విషయంలో తనపై దుష్ప్రచారం చేశారన్న చంద్రబాబు
15 August 2023, 13:31 IST
- Chandrababu On Gaddar: అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లో గద్దర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి సంతాపం తెలియచేశారు.
చంద్రబాబు
Chandrababu On Gaddar: గద్దర్‌పై కాల్పుల ఘటనలో తనపై దుష్ప్రచారం చేశారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు .మంగళవారం అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు, గద్దర్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. గద్దర్ ను భయం అంటే తెలియని వ్యక్తిగా అభివర్ణించారు. 1997లో గద్దర్‌పై జరిగిన కాల్పులు ఘటనపై చంద్రబాబు స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
కాల్పుల ఘటన తర్వాత కూడా గద్దర్ తనతో అనేక సార్లు మాట్లాడారని చెప్పారు. పేదల హక్కుల పరిరక్షణమే గద్దర్ ధ్యేయమని, తాను కూడా అలాంటి లక్ష్యాలతోనే ఉన్నానని చెప్పారు. హైదరాబాద్ అభివృద్దికి కారణం ఎవరో అందరీ తెలుసని, హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయని చెప్పారు.
గద్దర్ ఎన్నో ప్రజా పోరాటాలకు నాంది పలికారని, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకమని చెప్పారు. ప్రజాయుద్ధ నౌక పేరు వింటే గద్దర్ గుర్తొస్తారని, గద్దర్ జీవితం బావి తరాలకు ఆదర్శమన్నారు. గద్దర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
పేదవాళ్ల సమస్యలు, హక్కులపై గద్దర్ గళమెత్తారని, పేదల హక్కులపై గద్దర్ రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. భయమంటే తెలియని వ్యక్తి అని.. దేనికీ భయపడలేదన్నారు.
గద్దర్ చనిపోయినా.. ఆయన స్ఫూర్తి శాశ్వతమని సమాజహితం కోసం పనిచేసిన వ్యక్తిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పౌర హక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరవలేనిదని ప్రశ్నించే స్వరం మూగబోయిందన్నారు. ప్రజా చైతన్యంలో మొదట గుర్తొచ్చేది గద్దర్ అని, ప్రజా ఉద్యమాలకు గద్దర్ ఊపిరిపోశారన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ ది కీలక పాత్ర పోషించారని చెప్పారు. గద్దర్ ను చూస్తే ప్రజా యుద్ధనౌక గుర్తొస్తుందని గద్దర్ చనిపోయినా ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. గద్దర్ కేవలం ఒక వ్యక్తి కాదని ఆయనొక వ్యవస్థ అని నిరంతరం ప్రజల పోరాటంతోనే బతికిన వ్యక్తి గద్దర్ అన్నారు. గద్దర్ స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, - గద్దర్ ఆశయాలను కొనసాగించేలా మా కార్యాచరణ ఉంటుందని చెప్పారు.