తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadradri District : భద్రాద్రి జిల్లాలో రూ.9 కోట్ల విలువైన గంజాయి దహనం

Bhadradri District : భద్రాద్రి జిల్లాలో రూ.9 కోట్ల విలువైన గంజాయి దహనం

HT Telugu Desk HT Telugu

13 April 2024, 18:02 IST

google News
    • Bhadradri Kothagudem District Crime News: గత కొంతకాలంగా భదాద్రి జిల్లాలో గంజాయి జోరుగా పట్టుబడుతోంది. ఇటీవలే కాలంలో దొరికిన గంజాయిని దహనం చేశారు జిల్లా పోలీసులు. దీని విలువ రూ. 9 కోట్లకుపైగా ఉంది.
భద్రాద్రి జిల్లాలో రూ.9 కోట్ల విలువైన గంజాయి దహనం
భద్రాద్రి జిల్లాలో రూ.9 కోట్ల విలువైన గంజాయి దహనం

భద్రాద్రి జిల్లాలో రూ.9 కోట్ల విలువైన గంజాయి దహనం

Bhadradri Kothagudem District : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిత్యం గంజాయి(Cannabis) గుప్పుమంటూనే ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఈ జిల్లా మీదుగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇలా పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న రూ.9 కోట్ల పైచిలుకు విలువ చేసే గంజాయిని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో శనివారం దగ్ధం చేశారు.

 భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri)జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో నమోదైన 55 కేసుల్లో నిందితుల వద్ద నుంచి సీజ్ చేసిన 3,723 కేజీల నిషేధిత గంజాయిని హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారుగా 9 కోట్ల 31 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు ఐపిఎస్, కమిటీలో సభ్యులైన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో కోర్టు అనుమతి తీసుకుని ఈ నిషేధిత గంజాయిని ఉదయం నుంచి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేశారు. ముందుగా జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ లో తూకం వేసి పరిశీలించారు. అనంతరం దహనం కోసం సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టడం జరిగింది.

యువత టార్గెట్ గా గంజాయి విక్రయం..

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ…. NDPS యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని(Cannabis) దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని, ఇలా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తో పాటు డిఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం