తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Stationghanpur Brs: తాటికొండ, కడియం మధ్య కుదరని సయోధ్య, ట్రబుల్​ షూటర్ ఫోకస్​

StationGhanpur BRS: తాటికొండ, కడియం మధ్య కుదరని సయోధ్య, ట్రబుల్​ షూటర్ ఫోకస్​

HT Telugu Desk HT Telugu

31 October 2023, 6:25 IST

google News
    • StationGhanpur BRS: స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ప్రస్తుత అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదరడం లేదు. కొంతకాలంగా ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోగా.. సర్పంచ్​ నవ్య ఉదంతం ఇద్దరి మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోసింది. 
స్టేషన్ ఘన్‌పూర్‌ నేతలతో మంత్రి హరీష్ రావు
స్టేషన్ ఘన్‌పూర్‌ నేతలతో మంత్రి హరీష్ రావు

స్టేషన్ ఘన్‌పూర్‌ నేతలతో మంత్రి హరీష్ రావు

StationGhanpur BRS: స్టేషన్​ ఘన్ పూర్​ బీఆర్ఎస్​ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించడం, ఆ తరువాత తాటికొండ రాజయ్య అలకబూనడంతో క్యాడర్​ లో గందరగోళం ఏర్పడింది. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ చెరోసారి ఇద్దరితో మంతనాలు జరిపారు. అయినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య సంధి కుదిర్చే బాధ్యతను బీఆర్​ఎస్​ ట్రబుల్​ షూటర్​ గా చెప్పుకునే మంత్రి హరీశ్​ రావుకు అప్పగించారు. దీంతో ఆయన నియోజకవర్గంపై ఫోకస్​ పెట్టారు. ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

టికెట్​ రాకుండా చేశారనే..

దాదాపు ఆరు నెలల కిందట ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జానకీపురం సర్పంచ్​ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇందుకు ధర్మసాగర్​ మండలానికి చెందిన ఓ ఎంపీపీ కూడా సహకరిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. తన భర్త కూడా వారితో అంట కాగుతున్నాడంటూ ఆవేదన వెల్లగక్కింది.

నవ్య ఆరోపణలతో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ అధిష్ఠానం కూడా ఈ విషయాన్ని సీరియస్​ గా తీసుకుంది. గతంలో కూడా రాజయ్యపై మహిళల విషయంలో వివిధ ఆరోపణలు రాగా.. ఈసారి టికెట్ ఇవ్వకపోవడానికి నవ్య ఇష్యూ కూడా కారణమనే చర్చ జరిగింది.

సర్పంచ్​ నవ్యతో కడియం శ్రీహరే ఆరోపణలు చేయించారని, తాను టికెట్​ సొంతం చేసుకోవడానికి కడియం ఇలా ఎత్తుగడ వేశాడనే ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి మధ్య మరింత వైరం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ఒకరినొకరు ధూషించుకోవడం కూడా నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

కుదరని సయోధ్య

స్టేషన్​ ఘన్​ పూర్​ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్​ కాగా.. ఇక్కడ సిట్టింగ్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య కొంతకాలంగా వైరం నడుస్తోంది. స్టేషన్​ ఘన్​ పూర్​ టికెట్ ఆశిస్తూ కడియం శ్రీహరి నియోజకవర్గంలో కార్యక్రమాలు మొదలుపెట్టగా.. ఎమ్మెల్యే రాజయ్యపై ఆయన పరోక్షంగా అసహనం వెల్లగక్కే వారు.

ఎమ్మెల్యే రాజయ్య కూడా కడియంపై వివిధ కార్యక్రమాల సందర్భంగా మండిపడేది. దీంతో ఇద్దరి మధ్య కొంతకాలం పరోక్ష మాటల యుద్ధమే నడిచినా.. ఆ తరువాత నేరుగా పేర్లు పెట్టుకుని విమర్శించుకునే వరకూ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య లేదనే విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లింది. ఇదిలాఉంటే బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ ఆగస్టు 21న రిలీజ్​ చేసిన అభ్యర్థుల లిస్టులో స్టేషన్​ ఘన్​ పూర్ స్థానాన్ని సిట్టింగ్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రకటించడంతో రాజయ్య మరోసారి తీవ్ర అసహనానికి గురయ్యారు.

సీఎం కేసీఆర్​.. మంత్రి కేటీఆర్​ చెప్పినా నో ఛేంజ్​

టికెట్ల కేటాయింపు తరువాత ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మారే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. దీంతో సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​.. నియోజకవర్గ వాసి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డిని రంగంలోకి దింపారు. ఆయన ద్వారా రాజయ్యకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పల్లా ఒకటికి రెండుసార్లు రాజయ్యను కలిసి నచ్చజెప్పారు.

అనంతరం పల్లా రాజేశ్వర్​ రెడ్డి.. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఇద్దరినీ సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ వద్దకు తీసుకెళ్లి సంధి చేశారు. అయినా రాజయ్య కొద్ది రోజుల పాటు ఒప్పుకోలేదు. ఆ తరువాత రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి, భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో రాజయ్య కొద్దిరోజులు సైలెంట్​ అయ్యారు.

ట్రబుల్​ షూటర్​ కు బాధ్యతలు

సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ నచ్చజెప్పిన తరువాత కూడా క్షేత్రస్థాయిలో కడియం, తాటికొండ మధ్య విభేదాలు పూర్తిగా సద్దుమణగలేదు. ఎమ్మెల్యే రాజయ్య తన వర్గీయులను అణచివేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా తన వాళ్లపై కేసులు పెట్టించారంటూ కడియం శ్రీహరికి సహకరించేందుకు ముందుకురాలేదు. ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో గెలుపు కష్టమవుతుందనే ఉద్దేశంతో పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను బీఆర్​ఎస్ ట్రబుల్​ షూటర్​ గా పేరున్న మంత్రి హరీశ్​ రావుకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పలుమార్లు చర్చించిన అనంతరం గత శనివారం మంత్రి హరీశ్​ రావు స్టేషన్​ ఘన్​ పూర్​ నియోజకవర్గానికి వెళ్లి అక్కడి నేతలతో సమావేశం అయ్యారు.

ఇద్దరు నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యే రాజయ్యకు స్పష్టమైన హామీలు ఇచ్చారు. రాజయ్య వర్గీయులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సమక్షంలోనే హామీ ఇచ్చి ఆయనకు సర్దిచెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు సద్దుమణిగినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా నియోజకవర్గంలో రాజయ్య సామాజిక వర్గమే ఎక్కువగా ఉండగా.. ఆయన వర్గం నేతలు కొన్ని గ్రామాల్లో కడియంను వ్యతిరేకిస్తున్నారు. దీంతో మంత్రి హరీశ్​రావు మంత్రాంగం ఎంతమేరకు పని చేస్తుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(హిందుస్థాన్​ టైమ్స్​, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం