తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Meeting In Nanded : నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ బహిరంగ సభ….

BRS Meeting In Nanded : నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ బహిరంగ సభ….

HT Telugu Desk HT Telugu

05 February 2023, 9:11 IST

google News
    • BRS Meeting In Nanded భారత రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాలకు విస్తరించే క్రమంలో  మహారాష్ట్రలో  నేడు సభ నిర్వహిస్తున్నారు.  పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. గత వారం రోజులుగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నాందేడ్‌లో మకాం వేసి ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ సీఎం సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స‌భ ఏర్పాట్లను దగ్గరుండి చూడటంతో పాటు విస్తృతంగా గ్రామాల్లో ప‌ర్యటిస్తూ స‌ర్పంచ్‌లు, ఇత‌ర స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖుల‌ను క‌లుస్తూ సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు.
నాందేడ్‌లో బహిరంగ సభ జరుగనున్న వేదిక
నాందేడ్‌లో బహిరంగ సభ జరుగనున్న వేదిక

నాందేడ్‌లో బహిరంగ సభ జరుగనున్న వేదిక

BRS Meeting In Nanded బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో నేడు జరుగనున్న సభకు సర్వం సిద్ధమైంది. సభాస్థలి వేదికను బీఆర్‌ఎస్‌ శ్రేణులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్‌ పట్టణంతో పాటు సభ స్థలికి వెళ్లే దారులన్నీ కిలోమీటర్ల పొడవున గులాబీ తోరణాలతో అలంకరించారు. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

నాందేడ్‌లో సభా స్థలిని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలినడకన మైదానమంతా కలియతిరిగి.. సభా వేదిక అలంకరణ, అతిథులు, ముఖ్య నేతల సీటింగ్‌పై నేతలకు దిశానిర్దేశం చేశారు.

జాతీయ స్థాయిలో తొలి సమావేశం…..

బీఆర్‌ఎస్‌ పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలముల్లు, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ, తదితర నేతలు గత కొన్ని రోజులుగా నాందేడ్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ వీధుల్లో క‌లియ తిరుగుతూ వృద్ధులు, మ‌హిళ‌లు, రైతులు, యువ‌కులను ప‌ల‌క‌రిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమ‌ల‌వుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి గురించి తెలియ‌జేస్తున్నారు.

బిఆర్‌ఎస్‌ తోరణాలతో ముస్తాబైన నాందేడ్

మరోవైపు నాందేడ్ జిల్లా కేంద్రంలో జరగనున్న బీఆర్‌ఎస్‌ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోక‌ర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజ‌క‌వ‌ర్గాలు, కిన్వట్, ధ‌ర్మాబాద్ ప‌ట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయ‌త్ న‌గ‌ర్, తదితర మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజ‌లు త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉండటంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నాందేడ్ జిల్లా స‌రిహ‌ద్దు తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గాలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధ‌న్, జుక్కల్‌తో పాటు నిర్మల్, నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, శ్రేణులు స‌భ‌కు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీని దేశ వ్యాప్తంా పరిచయం చేసే లక్ష్యంతో అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ సమావేశాలను నిర్వహించేందుక కసరత్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం