తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Parliamentary Party: నేడు బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం… కేసీఆర్ తొలి సమావేశం

BRS Parliamentary Party: నేడు బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం… కేసీఆర్ తొలి సమావేశం

Sarath chandra.B HT Telugu

26 January 2024, 7:33 IST

google News
    • BRS Parliamentary Party: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని  కేసీఆర్‌ నేడు నిర్వహించనున్నారు. 
మాజీ సీఎం కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్

BRS Parliamentary Party: బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరుగనుంది. 26వ తేదీ శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది.

రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చివరి పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ చర్చించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌ అస్వస్థతతకు గురి కావడం, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో దాదాపు నెలన్నరకు పైగా విశ్రాంతికి పరిమితం అయ్యారు. ఇటీవల కేసీఆర్‌ ఊతకర్ర సాయంతో అడుగులు వేస్తున్నారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడంతో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెడుతున్నారు.

శుక్రవారం జరిగే సమావేశంలో పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై చర్చించన్నారు. లోక్‌ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో లేవనెత్తానాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరు కానున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయనే దానిపై ఆసక్తి నెలకొదంది.

కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలు….

జాతీయ పార్టీలు రెండు కలిసి బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని, కేసీఆర్‌ను ఎదుర్కోడానికి జట్టుకట్టాయని కేటీఆర్‌ ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై బీఆర్‌ఎస్‌తో కొట్లాడుతాయని ఆరోపించారు.

బండి సంజయ్‌ చేస్తున్న వ్యాఖ్యలు, అదానీతో రేవంత్‌రెడ్డి ఒప్పందాలు అందులో భాగమేనని విమర్శించారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని బెల్టు షాపులను ఎత్తేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఎలైట్‌ బార్లు పెడుతామంటున్నదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదంటూనే.. లక్ష ఎకరాలకు నీళ్లిచ్చామని మంత్రి కొండా సురేఖ చెప్పారని అన్నారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తారో ఇవ్వరో చెప్పాలని కేటీఆర్‌ నిలదీశారు.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందే గ్యారెంటీల అమలుకు జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుపై వెంటనే జీవోలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో కోటి 57 లక్షల మంది మహిళలు రూ.2,500 ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం…

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం అవుతున్నదని, శనివారం పార్టీ మైనార్టీ విభాగం సమావేశం ఉంటుందని చెప్పారు. శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్లమెంట్‌ ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

బండి సంజయ్‌ కరీంనగర్‌కు చేసిన పనులేంటో చెప్పాలని, ఆయన చెప్పిన అంశాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వినోద్‌కుమార్‌తో కరీంనగర్‌లో ఎక్కడ చర్చకు వస్తారో చెప్పాలని సవాల్‌ విసిరారు.

తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా కేంద్రానికి తాకట్టు పెట్టేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే వ్యవహారంపై శాసనసభలో చర్చించాల్సిందని, అఖిలపక్షాన్ని వేయాల్సిందని అన్నారు. కొత్తగా వచ్చామని చెప్తున్న ప్రభుత్వం, ఇంతలోనే అడ్డగోలుగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తదుపరి వ్యాసం