తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Vs Mlc: 'ఔట్ డేటెడ్' కామెంట్స్ చిచ్చు - తాండూరు Brsలో ముదురుతున్న వార్

MLA vs MLC: 'ఔట్ డేటెడ్' కామెంట్స్ చిచ్చు - తాండూరు BRSలో ముదురుతున్న వార్

16 July 2023, 10:21 IST

google News
    • Telangana Assembly Elections: ఎన్నికల టైం దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లో వర్గపోరు రచ్చకెక్కుతోంది. తాజాగా తాండూరు పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. ఔట్ డేటెడ్ లీడర్ అంటూ  ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరెంటో మరికొద్దిరోజుల్లోనే తెలుస్తుందన్నారు. 
తాండూరులో ముదురుతున్న వర్గపోరు(ఫైల్ ఫొటో)
తాండూరులో ముదురుతున్న వర్గపోరు(ఫైల్ ఫొటో)

తాండూరులో ముదురుతున్న వర్గపోరు(ఫైల్ ఫొటో)

MLA Rohit Reddy Vs MLC Mahender Reddy: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లోని అంతర్గత కలహాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధినాయకత్వం సూచనలతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ... ఎన్నికలకు మరికొద్దిరోజులే టైం ఉండటంతో.... నేతలు టాప్ గేర్ వేసే పనిలో పడ్డారు. అటువైపు నుంచి సౌండ్ వస్తే చాలు... ఇటువైపు నుంచి వెనువెంటనే కౌంటర్ వదిలేస్తున్నారు. ఇటీవలనే స్టేషన్ ఘన్ పూర్ పంచాయితీ ప్రగతి భవన్ కు చేరిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే... తాజాగా తాండూరు పంచాయితీ రాజుకుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేయటంతో... మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరెంటో త్వరలోనే తెలుస్తుందంటూ కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. ఇది కాస్త... వికారాబాద్ జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

తనను ఔట్ డేటెడ్ లీడర్ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. ఏకాంగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.... తాను ఔట్ డేటెడ్ లీడర్ కాదని.... పార్టీ మారినప్పుడే రోహిత్ రెడ్డి ఔట్ డేటెడ్ అయ్యాడంటూ కౌంటర్ ఇచ్చారు. అనుకోకుండా గెలిచి మొనగాడు అనుకుంటున్నాడని.... ఆయన గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుణ్యాన ఎమ్మెల్యే అయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఎవరికి వచ్చేది మూడు నెలల్లో తెలుస్తుందన్నారు. ఆయన మాటలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని... పార్టీ అనుమతితోనే ప్రెస్ మీట్ కూడా పెట్టినట్లు చెప్పటం కొసమెరపు. ఇక అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని... ఈ విషయంలో హామీ కూడా ఇచ్చారంటూ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదని కొట్టిపారేశారు.

రోహిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ చూస్తే తెలిసిపోతుందన్నారు మహేందర్ రెడ్డి. రోహిత్ రెడ్డి ఔట్ డేటెడ్ లీడర్ అని తాను మాత్రం కాదన్నారు. 2018 ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన గెలిచారని... ఎన్నికల టైంలో పార్టీ మారను అని స్పష్టంగా చెప్పిన రోహిత్ రెడ్డి... బీఆర్ఎస్ లో ఎలా చేరానని అడిగారు. ఇందుకు చేసిన వీడియోను కూడా మహేందర్ రెడ్డి మీడియాకు చూపించారు.

కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి పట్నం మహేందర్ రెడ్డితో వర్గపోరు నడుస్తోంది. ఎవరికి వారుగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చాలాసార్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. ఆయనకు ప్రభుత్వం కూడా వై కేటగిరి భద్రత కల్పించింది. ఈ నేపథ్యంలో… వచ్చేసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చి అండగా ఉంటుందా…? లేక ఇతక కారణాలరీత్యా పట్నంకే మరోసారి టికెట్ దక్కుతుందా అనేది చూడాలి…!

తదుపరి వ్యాసం