తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mlas Party Defection Case : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

BRS Mlas Party Defection Case : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

HT Telugu Desk HT Telugu

09 September 2024, 19:54 IST

google News
    • BRS Mlas Party Defection Case : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

BRS Mlas Party Defection Case : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగలనుందా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో మారు తెరమీదకు వచ్చింది. నాలుగు వారాల్లోగా చర్యలు కూడా తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల భవితవ్యం ఏంకానుందన్న చర్చ మొదలైంది. 2023 శాసనసభ ఎన్నికల్లో 66 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగా, 39 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. బోటా బొటి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆరు నెలల్లో తామే తిరిగి అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ప్రకటనలు చేశారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు.

ముందుగా తమకు ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కని జంట నగరాలపై కేంద్రీకరించారు. దీనిలో భాగంగానే ఖైతరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో పాటు, ఆయనను లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటికి పెట్టారు. అదే మాదిరిగా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతరు డాక్టర్ కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ, ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ టికెట్ పై తన కూతురును ఎంపీగా గెలిపించుకున్నారు. మరో వైపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం భద్రాచలం. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదులు చేసింది. స్పీకర్ స్పందించని కారణంగా హైకోర్టు మెట్లు ఎక్కింది. లోక్ సభ ఎన్నికల ముందు జరిగిన ఈ వ్యవహారంలో శాసన సభా స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాజాగా, సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై శాసన సభా కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

ఎవరెవరు పార్టీ మారారు?

నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం అంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యగా ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పక్షంలోకి దూకడం సర్వసాధారణంగా జరిగే పరిణామే. ఈ కారణంగా ప్రభుత్వాలు పడిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చన సందర్భాలు కూడా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. వీరు కాకుండా శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేషం, బొగ్గారపు దయానంద్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచాక, వివిధ కారణాలను సాకుగా చూపెట్టి మరో రాజకీయ పార్టీలో దూకడాన్ని అడ్డుకునేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూలును చేర్చారు. అందులో 101, 102, 190, 191 ఆర్టికల్స్ లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరంగా పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ బి ఫారంపై (పార్టీ ఎన్నికల గుర్తు) గెలిచి, మరో పార్టీలో చేరి, విప్ ను ధిక్కరించిన సందర్భాల్లో స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చు. అయితే, దీనిని నుంచి బయట పడేందుకు మెజారిటీ రాజకీయ పార్టీలు తమ పార్టీలో చేరిన వారిని తమ ఖాతాలో వేసుకోకుండా వారి మద్దుతును మాత్రం కూడగడుతుంటాయి. అంతే కాకుండా ఒక పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు పార్టీ మారితే, దానిని విలీనంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు.

నాటి టీఆర్ఎస్ చేసింది అదే

2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీ శాసనసభా పక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకోవడం ద్వారా ఆ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేల సంఖ్యను తమ ఖాతాలో వేసుకుంది. శాసనమండలిలోనూ ఇదే జరిగింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు అప్పటి టీఆర్ఎస్ లో విలీనం అయ్యారు. 2018 శాసన సభ ఎన్నికల్లో రెండో సారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంది. రెండింట మూడొంతుల మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారడంతో కాంగ్రెస్ శాసన సభాపక్షం, బీఆర్ఎస్ శాసన సభాపక్షంలో వీలినం జరిగినట్లు ప్రకటించారు. దీంతో ఫిరాయింపుల చట్టం వర్తించలేదు.

బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నట్టే.., కాంగ్రెస్ సైతం అదే బాటలో ఉంది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటోంది. కానీ, బీఆర్ఎస్ శాసన సభాపక్షాన్ని విలీనం చేసుకునేంత సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ లోకి రాలేదు. బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను టార్గెట్ చేసి స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తమ పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచిన సభ్యుడు ఇతర పార్టీలోకి వెళ్లడాన్ని నిరిస్తూ ఫిర్యాదు చేస్తే, సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేసే నిర్ణయాధికారం సభాపతి (స్పీకర్)కి ఉంటుంది.

ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ శాసన సభాపక్ష తరపున స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ హై కోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన సభ్యులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేసినా, చర్యలు తీసుకోవడంలో విఫలమైనా కోర్టుల్లో సవాల్ చేసే వెసులుబాటును పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కల్పించింది. దీని ఆధారంగానే బీఆర్ఎస్ హై కోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల్లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని శాసన సభా కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండప్రతినిధి )

తదుపరి వ్యాసం