తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mothkupally Protest : చంద్రబాబు అరెస్టు... ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష

Mothkupally Protest : చంద్రబాబు అరెస్టు... ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష

24 September 2023, 12:26 IST

google News
    • Chandrababu Arrest Updates: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ… హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మాజీ మంత్రి మోత్కుపల్లి నిరసన దీక్షకు దిగారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది.
మాజీ మంత్రి మోత్కుపల్లి దీక్ష
మాజీ మంత్రి మోత్కుపల్లి దీక్ష

మాజీ మంత్రి మోత్కుపల్లి దీక్ష

BRS leader Mothkupally Narsimhulu : మాజీ మంత్రి మోత్కుపల్లి నిరసనకు దిగారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ… ఈ నిరసన దీక్ష చేపట్టారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన… దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది. మరోవైపు మోత్కుపల్లి దీక్షకు ఎన్టీఆర్ ఘాట్‌లో అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీక్ష చేసి తీరుతానని మోత్కుపల్లి పోలీసులకు తెలిపారు. అయితే మోత్కుపల్లి దీక్ష భగ్నం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నిరసన దీక్ష సందర్భంగా మరోసారి మీడియాతో మాట్లాడారు మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం ఆనందం పొందారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న విధానాలను చూసి ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఎదుటి వారిని ఇబ్బంది పెడితే జగన్‌కే నష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

“సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగితే కొట్టి, ఇడ్చుకెళ్లి కొట్టించిన చరిత్ర జగన్ ది.ఈ ఘటనను నువ్వు ఖండించావా..? కనీసం ఆ దళిత కుటుంబాన్ని పరామర్శించవా…? వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు.ఇది ఎంత వరకు సమంజసం. జగన్ నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. లేకపోతే నిన్ను తరిమికొడుతారు. చంద్రబాబు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. నీలాగ అందరూ జైలుకు వెళ్లాలా..? నీ నియంతృత్వ విధానంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లటం చూసి దుఖం వస్తుంది. జైలులో సరిగా వసతులు లేని పరిస్థితి ఉంది. గుండె బరువు ఎక్కి మాట్లాడుతున్నాను. జగన్ కు నేను వ్యతిరేకం కాదు... దుర్మార్గానికి వ్యతిరేకం. లోకేశ్ ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి ఆలోచన దుర్మార్గం. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రావణ కాష్ఠమే అవుతుంది. చంద్రబాబు కుటుంబాన్ని మొత్తం చంపే ప్రయత్నం చేస్తున్నారు. నా పోరాటం కొనసాగుతుంది” అని మోత్కుపల్లి స్పష్టం చేశారు.

ఇక బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ… చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలు సరికావన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు.

తదుపరి వ్యాసం