తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party : ఆ నేతకే మళ్లీ ఎంపీ టికెట్...! లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్

BRS Party : ఆ నేతకే మళ్లీ ఎంపీ టికెట్...! లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్

26 December 2023, 16:03 IST

google News
    • Lok Sabha elections 2024: వచ్చే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్… వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలవాలని చూస్తోంది. ఇందులో భాగంగా… చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్. పలు అంశాలపై చర్చించారు.
చేవెళ్ల లోక్ సభ సీటుపై బీఆర్ఎస్ ఫోకస్
చేవెళ్ల లోక్ సభ సీటుపై బీఆర్ఎస్ ఫోకస్

చేవెళ్ల లోక్ సభ సీటుపై బీఆర్ఎస్ ఫోకస్

Lok Sabha elections 2024: వచ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల‌ని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. సోమవారం చేవెళ్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మితో కుంగిపోవ‌ద్ద‌న్నారు. ప‌రాజ‌యం చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల‌ని… వారు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించాల‌న్నారు. జ‌న‌వ‌రి 26వ తేదీలోగా స‌మావేశాలు పూర్తి చేసుకోవాల‌న్నారు కేటీఆర్.

గతంలో మాదిరిగానే చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలన్నారు కేటీఆర్. అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మన బీఆర్ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్ ఉందని గుర్తు చేశారు. అదేస్థాయిలో… అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కోరారు. ఈ భేటీకి మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు.

మరోసారి రంజిత్ రెడ్డే…!

2019 లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయగా…రంజిత్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ నుంచి జనార్థన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి 14వేల మెజార్టీతో వచ్చింది. అయితే ఈసారి కూడా రంజిత్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించనుంది బీఆర్ఎస్. ఇక బీజేపీ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఇక్కడ విజయం సాధించాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టిన కాంగ్రెస్… మంచి జోష్ తో ఉంది. పైగా ఈ నియోజకవర్గ బాధ్యులుగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అత్యంత హాట్ సీటుగా చేవెళ్ల ఉండే అవకాశం స్పష్టంగా ఉంది.

మొత్తంగా చూస్తే చేవెళ్లలో త్రిముఖ పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో అలర్ట్ అయిన బీఆర్ఎస్…. అనుసరించాల్సిన వ్యూహలపై ఫోకస్ పెట్టింది.

తదుపరి వ్యాసం