Congress Ministers: ప్యూడల్ భావజాలంతో బీఆర్ఎస్ మహిళలను అవమానిస్తోంది.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి సీతక్క ఫైర్
01 October 2024, 5:37 IST
- Congress Ministers: బీఆర్ఎస్ నేతలు దుర్మార్గమైన ఫ్యూడల్ భావజాలంతో మహిళలను అత్యంత అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మార్పింగ్ ఫోటోలతో ట్రోల్ చేస్తూ వేయ్యేళ్ళు వెనకకు నెట్టి మళ్లీ దొరతనమే ముందుండాలని దుష్ట సాంప్రదాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి సీతక్క
Congress Ministers: మహిళలపై బిీఆర్ఎస్ దుష్ప్రచారానికి చెక్ పెట్టాలని సీతక్క ప్రతి ఒక్కరిని కోరారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా జాతిని అవమానపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ట్రోల్ చేయడంపై సీరియస్ గా స్పందించారు. బిఆర్ఎస్ నాయకులు మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి కొండా సురేఖకు ఎంపీ గౌరవంగా నూలు దండవేసి సత్కరిస్తే షాదిముబారక్ అంటు సెటైర్ లు వేయడం దుర్మార్గమన్నారు సీతక్క. తాను రాఖీ కట్టే సోదరులతో అసెంబ్లీలో కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దుర్మార్గంగా ప్రవర్తించారని విమర్శించారు. ఆడవాళ్లుగా రాజకీయాల్లో ఉండాలా?.. వద్దా? అని ప్రశ్నించారు.
మా పని మేము చేసుకుంటే బిఆర్ఎస్ వెంటపడి వేధిస్తుందని ఆరోపించారు. మనుషులు కాదా... అధికారంలో ఉండి ఇన్నాళ్ళు ఏం నేర్చుకున్నారని ప్రశ్నించారు. మీ ఇంట్లో వాళ్ళు ఏం చేశారో దేశానికి అంతటికి తెలుసు... ఆడవాళ్లుగా మేము ఆ విషయాల గురించి ఏనాడూ మాట్లాడలేదన్నారు. ఆడవాళ్లంటే బిఆర్ఎస్ కు చులకన బావం... దురాహంకారం ఎందుకని ప్రశ్నించారు. దుర్మార్గమైన ఫ్యూడల్ భావజాలంతోనే మహిళలను అత్యంత అవమానకరంగా బిఆర్ఎస్ చిత్రీకరిస్తుందని సీతక్క ఫైర్ అయ్యారు.
మార్పింగ్ ఫోటోలతో ట్రోల్ చేస్తూ వేయ్యేళ్ళు వెనకకు నెట్టి మళ్లీ దొరతనమే ముందుండాలని దుష్ట సాంప్రదాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, మహిళలకు మద్దతుగా నిలిచే వారు బిఆర్ఎస్ దుష్ప్రచారానికి చెక్ పెట్టాలని సీతక్క కోరారు.
హైడ్రాతో పేదలకు అన్యాయం జరగనివ్వం
మూసీ ప్రక్షాళన... హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రమంత్రి సీతక్క స్పందించారు. పేదలకు అన్యాయం జరగనివ్వమన్నారు. పొలిటికల్ ఇన్వాల్ మెంట్ తో పైరవీల కారణంగా అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు. గత ప్రభుత్వం 70 ఏళ్ళలో విధ్వంసం జరిగిందని, పూర్తిస్థాయిలో పునరుద్దరిస్తామని విచ్చలవిడిగా పర్మిషన్ లు ఇచ్చారని విమర్శించారు.
దళారులను, బిల్డర్ లను ఎంకరేజ్ చేసి పేదలను ఇబ్బందుల్లోకి నెట్టారని తెలిపారు. కామారెడ్డిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చెరువుల్లో కట్టించారని... ఆ పాపం ఎవరిదని ప్రశ్నించారు. పేదలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. అసలైన పేదలకు లాభం చేకూర్చుతామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తిట్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఎంతవరకు సమంజసమని సీతక్క ప్రశ్నించారు.
మహిళల పట్ల గౌరవం ఉంటే డిజిపి కి పిర్యాదు చేయండి- మంత్రి పొన్నం
మహిళల పట్ల బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే సోషల్ మీడియాలో మంత్రి సురేఖపై ట్రోల్ చేస్తున్న విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి కి ఫిర్యాదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని బిఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా మెదగాలని హితవు పలికారు. మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రి రాజకీయంగా ఎదిగితే ఓర్వలేక పోస్టులు పెట్టి ట్రోల్ చేయడం మంచిపద్దతి కాదన్నారు. మహిళా జాతిని అవమానపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై బిఆర్ఎస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల పట్ల గౌరవం ఉంటే..పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిజిపి కి లేఖ రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
2 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
అక్టోబర్ 2 నుంచి గ్రామ పంచాయతీ లలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సీతక్క పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. స్వచ్చత హి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందన కార్యక్రమం అక్టోబర్ 4, 5 తేదీల్లో హైదరాబాదులో నిర్వహిస్తామన్నారు.
ప్రతి అధికారి గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యనికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్లాస్టిక్ ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. పచ్చదనం స్వచ్చదనం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. వాటర్ ట్యాంక్ లు 15 రోజులకోసారి తప్పనిసరిగా శుద్ధి చేయాలని అన్నారు.
మంత్రుల పర్యటనలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ కాంతి వెస్లీ, గ్రామీణభివృద్ధి కమిషనర్ అనిత రామచంద్రన్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)