TS Assembly Elections 2023 : ఆయన వస్తానంటే.. ఈయన వద్దంటున్నారు..! ట్రయాంగిల్ ఫైట్ తప్పదా..?
26 July 2023, 10:52 IST
- Nalgonda District Politics: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ నియోజకవర్గంలోని పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీకి చెందిన ఓ నేత పార్టీ మారాలని అనుకుంటే… అటువైపు ఉన్న నేత అడ్డుకుంటున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది.
చేరికలు - ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు
Nakrekal Assembly Constituency: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు వేదిక కాబోతుంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లిపోయాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్దం చేస్తూ.... పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. దాదాపు ప్రతిపక్షాలన్నీ బీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాయి. మూడోసారి కూడా తామే గెలుస్తామన్న ధీమాలో ఉంది గులాబీ పార్టీ. మరోవైపు నేతలు పార్టీలు మారిపోతున్నారు. అటు నుంచి ఇటు నుంచి అటు అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. త్వరలోనే కాంగ్రెస్ కు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా కారెక్కుతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇటీవలే యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే నకిరేకల్ నియోజకవర్గంలోని పరిస్థితి మాత్రం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే… హస్తం వైపు చూస్తుంటే… జిల్లాకు చెందిన సీనియర్ నేత అడ్డుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫలితంగా ఆయన చేరికపై సందిగ్ధత నెలకొంది.
గ్రీన్ సిగ్నల్ వస్తుందా..? లేదా..?
గత కొంతకాలంగా నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య.... ఆ తర్వాత కారెక్కారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం... లింగయ్య వర్గాల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు తలెత్తాయి. ఎవరికి వారిగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పలువురు అభ్యర్థులను స్వతంత్రంగా నిలబెట్టి గెలిపించారు. హోలీ పండగ వేళ... ఇద్దరు నేతలు కూడా బాహాబాహీకి దిగారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదంటే తమది అంటూ డైలాగ్ లు విసురుకున్నారు. కట్ చేస్తే.... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున వీరేశానికి టికెట్ కేటాయించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన... పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లో చేరుతారనే టాక్ వినిపించింది. అయితే వీరేశం చేరికను ఎంపీ వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో వీరేశం పేరు ప్రధానంగా వినిపించిన సంగతి తెలిసిందే. దీనికితోడు పలు కారణాల రీత్యా... వీరేశం ఎంట్రీకి బ్రేక్ లు వేశారన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... రాష్ట్ర నాయకత్వం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన చేరికలపై ఆచితూచీ అడుగులు వేసే పరిస్థితి నెలకొంది.
ట్రయాంగిల్ ఫైట్ తప్పదా..?
వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఉండే పరిస్థితి ఉంది. అయితే వీరేశం కాంగ్రెస్ లో చేరి టికెట్ పొందితే.... బీఆర్ఎస్ విజయం అంత సులభం కాకపోవచ్చు. కానీ ఆయన చేరకపోతే... స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వీరేశం... 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయనకంటూ ఓ ఫాలోయింగ్ ఉంది. వీటికి తోడు వామపక్ష నేపథ్యం ఉండటం కూడా ఆయనకు ఇక్కడ కలిసివచ్చే అవకాశం ఉంది. ఒకవేళ... ఆయన ఇండిపెండెంట్ గా బరిలో నిలిస్తే... నకిరేకల్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదన్న విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి.