BRS Protests: రైతు రుణమాఫీలో ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు బీఆర్ఎస్ ఆందోళనలు
22 August 2024, 8:47 IST
- BRS Protests: రైతు రుణ మాఫీ తెలంగాణలో మంటలు రేపుతున్నాయి. ప్రభుత్వం మూడు విడతల్లో రుణ మాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించినా... వివిధ కారణాలతో రుణమాఫీ కానీ రైతుల సంఖ్య తక్కువగా ఏమీ లేదు. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకారమే ఇంకా 17 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉంది.
రైతు రుణమాఫీ అమలుపై బీఆర్‌ఎస్ ఆందోళనలు
BRS Protests: రుణమాఫీ అమలులో లోపాలను నిరసిస్తూ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కనీసం రూ. 49వేల కోట్ల రుణాలు ఉన్నాయని, వాటిని మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత రూ.40 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినా, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం రూ.31వేల కోట్లు మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.
కానీ, ఈ సారి బడ్జెట్ లో రుణ మాఫీ కోసం కేవలం రూ.26వేల కోట్లకు కుదించారన్నది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న కీలక అభియోగం. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణ మాఫీలో భాగంగా రూ.2లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. ఆ రోజుకు రూ.17వేల కోట్ల రుణ మాఫీ పూర్తి చేశామని, ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీని పూర్తి చేశామని ప్రకటించారు.
పొంతన కుదరని గణాంకాలు
అయితే... రుణమాఫీ జరగని రైతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండడంతో ఆందోళనలు మొదలయ్యాయి. రైతుల ఆందోళనలు, ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సాగునీటి శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వేర్వేరు ప్రకటనలు మరింత గందరగోళానికి దారితీశాయి.
మంత్రి పొంగులేటి రూ.12వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 17లక్షల మంది రైతులకు రుణ మాపీ జరగాల్సి ఉందని ప్రకటించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరిగిపోయిందని చేసిన ప్రకటతో విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, వివిధ రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
ఆగస్టు15వ తేదీ లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన కారణంగానే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు, అదే యాదాద్రి జిల్లా నుంచి ధర్నాకు శ్రీకారం చుట్టనున్నారు. 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామావు (కేటీఆర్) ఇప్పటికే ప్రకటించారు.
పెరిగిపోతున్న ఫిర్యాదుల సంఖ్య
రుణమాఫీ జరగని రైతుల నుంచి నిత్యం వేలాదిగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. వివిధ సాంకేతిక కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగని అన్నదాతలు లక్షల్లో ఉన్నారు. మండల వ్యసాయ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి, ఫిర్యాదులు అందిన రైతుల వివరాలు తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే కూడా జరిపి, తప్పిదాలను సరిదిద్దే పనిలో వ్యవసాయ శాఖ ఉంది.
కాగా, ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందలేక పోయిన రైతుల నుంచి లక్ష దాకా ఫిర్యాదులు రాష్ట్ర వ్యవసాయ శాఖకు అందినట్లు సమాచారం. రుణమాఫీ కోసం రైతులు అటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ, తమ సర్వీసు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరో వైపు కనీసం 22వేల రైతుల ఖాతా నుంచి రుణమాఫీ డబ్బును వాపస్ తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు.
కానీ, ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 80వేల ఫిర్యాదులు అందాయని, వాటిలో 8వేల దాకా పరిష్కరించామని ప్రకటించిన విషయం తెలిసిందే. రోజు రోజుకూ రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఖాతాల సవరణ, రైతులకు వివరాలు అందివ్వడంలోనే బ్యాంకు సమయం ముగిసిపోతోందని, సాధారణ వినియోగదారుల బ్యాంకు సేవలకూ ఆటంకం కలుగుతోందని ఓ బ్యాంకు మేనేజర్ అభిప్రాయపడ్డారు.
ఆలేరులో హరీష్ రావు ధర్నా
మాజీ మంత్రి హరీష్ రావు గురువారం యాదాద్రి దేవాలయం దర్శించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులతో కలిసి పూజలు చేయనున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ‘‘ కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు ఆలేరులో నిర్వహించే ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొంటారు..’’ అని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )