తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : సోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, రేపు పండరీపురంలో పర్యటన

CM KCR : సోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, రేపు పండరీపురంలో పర్యటన

26 June 2023, 21:44 IST

google News
    • CM KCR : రెండ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని సోలాపూర్ చేరుకున్నారు. సోలాపూర్ లో స్థానిక బీఆర్ఎస్ నేత ఇంటికి వెళ్లి వారి ఆథిత్యాన్ని స్వీకరించారు. రేపు పండరీపురంలోని విట్టల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించనున్నారు కేసీఆర్.
మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ టూర్
మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ టూర్

మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ టూర్

CM KCR : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ (సోమవారం) మహారాష్ట్రలోని ధారాశివ్, సోలాపూర్ జిల్లాల్లో పర్యటించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మహారాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కూడిన దాదాపు 600 వాహనాలతో కాన్వాయ్ బయలుదేరింది. దాదాపు 6 కిలోమీటర్ల మేర సీఎం వెంట కాన్వాయ్ సాగింది. ముంబాయి రహదారి మీదుగా ప్రయాణిస్తున్న సీఎం కాన్వాయ్ కు రహదారి పొడుగునా పూలు చల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. ధారాశివ్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడి స్థానిక నాయకులు, మహిళలు సంప్రదాయ రీతిలో హారతినిచ్చి, స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సోలాపూర్ కు బయలుదేరారు. ఆ సమయంలో జోరువాన కురుస్తున్నా లెక్కచేయకుండా సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది.

ధర్మన్న సాదుల్ ఇంటికి వెళ్లిన కేసీఆర్

సోలాపూర్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్థానిక నాయకులు, శ్రేణులు స్వాగతం పలికాయి. స్థానిక నేతలు భారీ గజమాలతో కేసీఆర్ ను సత్కరించారు. ‘దేశ్ కి నేత కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదాలు చేశారు. సోలాపూర్ ప్రజల అపూర్వ స్వాగతం మధ్య సీఎం కేసీఆర్ బాలాజీ సరోవర్ హోటల్ కు చేరుకొని కాసేపు సేదతీరారు. అనంతరం సీఎం కేసీఆర్ హోటల్ నుంచి బీఆర్ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వానం మేరకు, సోలాపూర్ భావనారుషి పేట్ లోని వారి ఇంటికి వెళ్లి ఆథిత్యాన్ని స్వీకరించారు. ధర్మన్న సాదుల్ ఒకసారి మేయర్ గా, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున సోలాపూర్ నియోజకవర్గ ఎంపీగా సేవలు అందించారు. ఈ సందర్భంగా ధర్మన్న సాదుల్ తన కుటుంబ సభ్యులను సీఎంకు పరిచయం చేశారు. కేసీఆర్ ధర్మన్న సాదుల్ తో సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ రాత్రి బస నిమిత్తం బాలాజీ సరోవర్ హోటల్ కు తిరిగి చేరుకున్నారు.

ఇటీవలె బీఆర్ఎస్ లో చేరిన ధర్మన్న సాదుల్

ధర్మన్న సాదుల్ గృహానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు అక్కడే స్థిరపడిన తెలంగాణ ప్రజలు దారి పొడవునా స్వాగతం పలుకుతూ, ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పద్మశాలీలు ఎక్కువగా స్థిరపడ్డ సోలాపూర్ లోని ఈ ప్రాంతంలోనే బీఆర్ఎస్ నాయకుడు ధర్మన్న సాదుల్ నివాసం కూడా ఉన్నది. ధర్మన్న సాదుల్ తెలంగాణకు చెందిన పేద పద్మశాలి కుటుంబంలో జన్మించారు. కరీంనగర్ జిల్లా కన్నాపూర్ గ్రామ వాస్తవ్యులైన వీరి పూర్వీకులు ఉపాధి కోసం సోలాపూర్ కు వచ్చి స్థిరపడ్డారు. ధర్మన్న సాదుల్ కాల క్రమంలో ప్రజా నాయకునిగా పలు పదవుల్లో రాణించారు. అనంతరం బీఆర్ఎస్ ఆదర్శాలకు, విధానాలకు ఆకర్షితులై సీఎం కేసీఆర్ పాలనను మహారాష్ట్ర ప్రజలకు కూడా అందించాలని లక్ష్యంతో ఇటీవలే సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

షోలాపూర్ ధారాశివ్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ రేపటి పర్యటన షెడ్యూల్

మంగళవారం ఉదయం పండరీపురంలోని విట్టల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. అక్కడ విఠలేశ్వరునికి సన్నిధిలో పూజలు చేస్తారు. అక్కడ నుంచి సర్కోలిలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తుల్జా భవాని అమ్మవారి దేవస్థానానికి చేరుకొని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

తదుపరి వ్యాసం