BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన
17 May 2024, 8:44 IST
- BRS Protest: తెలంగాణలో సన్న వరి ధాన్యం పండించిన రైతులకే బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచించడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి.
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన
BRS Protest: ధాన్యం మద్దతు ధరలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ధర్నాలు రాస్తారోకోలతో ప్రభుత్వ తీరును నిరసించారు.
కరీంనగర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధర్నా చేయగా కోరుట్ల, జగిత్యాల లో రైతులతో కలిసి ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంటల సంజయ్, డాక్టర్ ఎం.సంజయ్ ధర్నా రాస్తారోకో చేశారు. సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామనే నిబంధనలు పెడితే ఊర్కోమన్నారు.
తెలంగాణలో ఎక్కువగా రైతులు దొడ్డు రకం వడ్లు పండిస్తారని, సన్నం, దొడ్డు తేడా లేకుండా రైతులు పండించిన పంటకు మద్దతు ధర తోపాటు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన ఆందోళనలు ఉదృతం చేస్తామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్- గంగుల కమలాకర్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని.. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రకారం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, అన్ని రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ, రైతుబరోసా, మద్ధతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామన్నారని తెలిపారు. హామీలేవీ నిలబెట్టుకోకపోవడం వల్లే రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ తోపాటు ప్రతి రైతు అకౌంట్లో ఎలాంటి నిబంధనలు లేకుండా క్వింటాలుకు రూ.500 రు బోనస్ వేయాలని డిమాండ్ చేసారు.
ఓట్లు పడగానే సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చాడని కేవలం సన్నరకానికే రూ.500 బోనస్ ఇస్తాననడం మోస పూరిత చర్య అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను గుర్తించే విధానం లేదని..ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు వచ్చినా ఇప్పటి వరకు 33 లక్షల టన్నులే కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు సజావుగా సాగడంలేదన్నారు.
తాము ఉన్నప్పుడు 95 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని గుర్తు చేసారు. తెలంగాణ లో పంట దిగుబడి తగ్గిందా? లేదంటే రైతులు ప్రైవేటుకు అమ్ముకున్నారా? వెళ్లడించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారని తడిచిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు.
కోనరావుపేటలో అన్నదాతల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ కార్యకర్తలతోపాటు రైతన్నలు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్ళలో జాప్యాన్ని నిరసిస్తూ కోనరావుపేట మండలం కేంద్రంలో అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
45రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసిందని, నాణ్యత లేదని రకరకాల కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. తరుగు, తేమ పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే స్థానికంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులు రకరకాల కొర్రీలు పెట్టి కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు రావాలని, ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో గంటకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి దాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, కరీంనగర్)