BJP vs BRS In Dubbaka : ఉద్రిక్తత నడుమ దుబ్బాక బస్టాండ్ ప్రారంభం
07 August 2023, 14:10 IST
- BJP vs BRS దుబ్బాకలో తీవ్ర ఉద్రిక్తత నడుమ బస్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు బస్టాండ్ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత
BJP vs BRS ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవం దుబ్బాకలో తీవ్ర ఉద్రిక్తతకు రేపింది. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు పోటాపోటీ సవాళ్లు చేసుకోవడంతో బస్టాండ్ వద్ద భారీగా పోలీసుల్ని మొహరించారు. బస్టాండ్ ఆవరణలోకి కార్యకర్తల్ని అనుమతించక పోవడంతో బీజేపీ, బిఆర్‌ఎస్ కార్యకర్తల మధయ తోపులాట చోటు చేసుకుంది. అంతకు ముందు హబ్సిపూర్‌లో ప్రభుత్వ గోడౌన్ ప్రారంభోత్సవంలో తోపులాట చోటు చేసు కోవడంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించి మంత్రి హరీష్ రావు వెనుదిరిగి వెళ్ళిపోయారు. కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా రెండు పార్టీల కార్యకర్తలు శాంతించకపోవడంతో ఉద్రిక్తత నడుమే కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు.
బస్టాండ్ ఆవరణలోకి ఇరు పార్టీల కార్యకర్తల్ని అనుమతించకపోతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఓ పార్టీ కార్యకర్తల్ని అనుమతించి మరో పార్టీని ఆపేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్ లో హైటెన్ వాతావరణం నెలకొంది. దుబ్బాకలో కొత్తగా కట్టిన బస్టాండ్‌ను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. జిల్లా మంత్రి హరీష్ రావుతో పాటు ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్, మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ హాజరయ్యారు.
దుబ్బాక బస్టాండ్ నిర్మాణం క్రెడిట్ తమదంటే తమదని బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. ఉప ఎన్నికల సమయంలో దుబ్బాక పాత బస్టాండ్ చుట్టూ రాజకీయాలు నడిచాయి . దుబ్బాకలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేస్తే, ఏడేళ్లలో బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో దుబ్బాక బస్టాండ్ చూస్తే తెలుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు చేశారు.
ఉప ఎన్నికల ప్రచారంలో దుబ్బాకలో బస్టాండ్ కట్టిస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. దుబ్బాకలో తమ ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇంత త్వరగా బస్టాండ్ కట్టించిందని బీజేపీ నేతలు ప్రకటించారు. బస్టాండ్ క్రెడిట్ తమదంటే తమదని రెండు పార్టీల నేతలు పోటీ పడి ప్రచారం చేసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బస్టాండ్ ప్రారంభోత్సవానికి రెండు పార్టీల నేతలు హాజరు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
బస్టాండ్ ప్రారంభోత్సవానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంట పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలి రావడంతో టిఆర్ఎస్ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌన్సిలర్లు, ముఖ్య నాయకుల్ని మాత్రమే బస్టాండ్‌లోకి పోలీసులు అనుమతించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ, బిఆర్‌ఎస్ కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు హరీష్ రావు, రఘునందన్ రావు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు అరుపులు, నినాదాల మధ్యే కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది.