తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: ప్రగతి భవన్ నుంచే రాహుల్ కు స్క్రిఫ్ట్.. అందుకే ఆ పేరు ఎత్తలేదు

Bandi Sanjay: ప్రగతి భవన్ నుంచే రాహుల్ కు స్క్రిఫ్ట్.. అందుకే ఆ పేరు ఎత్తలేదు

HT Telugu Desk HT Telugu

08 May 2022, 5:55 IST

    • కాంగ్రెస్ - టీఆర్ఎస్ ల మధ్య పొత్తు ముందే నిర్ణయమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రగతి భవన్ లో తయారు చేసిన స్క్రిఫ్టే రాహుల్ చదవారని ఆరోపించారు. అందుకే రాహుల్ నోట.. కేసీఆర్ పేరు రాలేదన్నారు.
కాంగ్రెస్ టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు
కాంగ్రెస్ టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు (twitter)

కాంగ్రెస్ టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు

ప్రగతిభవన్‌ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌నే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్‌ సభలో చదివారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర 24వ రోజు శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నక్కలబండ తండా వద్ద కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ , టీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. వారి ఇద్దరి మధ్య ఒప్పందం ఉందని.. అందులో భాగంగానే రాహుల్ నోట... కేసీఆర్ పేరు రాలేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకే మాత్రమే ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, తెలుగుదేశం కలసి పోటీ చేశాయని, బీజేపీ ఎప్పుడూ ఆ పార్టీలతో కలిసి పోటీచేయలేదన్నారు. రాష్ట్రంలో వరి కొనుగోళ్ల డబ్బులు తామే ఇస్తున్నామని.. మద్దతు ధరలు కాంగ్రెస్‌ హయాంలో కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ తో వచ్చేదిలేదు పోయేది లేదన్నారు బండి సంజయ్. అసలు రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. 80 శాతం హిందువులను ఏకతాటిపైకి తెస్తానని.. హిందూ సంఘటనా శక్తి దమ్మేంటో చూపిస్తామని సంజయ్‌ సవాల్ విసిరారు. ఉర్దూ మీడియంతో పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన వారిని అధికారంలోకి రాగానే తొలగిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

రాహుల్ ది రాజకీయ యాత్ర - తరుణ్ చుగ్

రాహుల్ పర్యటనపై బీజేపీ తెలంగాణ వ్యవహరాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. ఆయనది రాజకీయ యాత్ర అని విమర్శించారు. రైతుల కోసం తెలంగాణ పర్యటనకు రాలేదని ఆరోపించారు. ఇక హైదరాబాద్ లో దళిత యువకుడు నాగరాజును హత్య చేస్తే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందంతా ఎంఐఎం కోసమే అని ఆరోపించారు.

తదుపరి వ్యాసం