Anti Bihar Comments : కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు... బిహార్ నేతల కౌంటర్.. !
10 February 2023, 23:30 IST
- Anti Bihar Comments : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన విమర్శలపై.... బిహార్ నేతలు ఫైర్ అవుతున్నారు. రఘునందన్ వ్యాఖ్యల్ని ... బిహార్ రాష్ట్ర ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ... తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని... బిహార్ బీజేపీ నేతలు సైతం హితవు పలుతుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
Anti Bihar Comments : తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా... రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ బిహార్ నుంచి కూడా వస్తోంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ నేతలు.. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై రాజకీయ విమర్శలు చేస్తూ... బిహార్ రాష్ట్రాన్ని ఉదహరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మాట్లాడితే.. ఊరికునేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు... తమ రాష్ట్రం పట్ల బీజేపీ వైఖరిని చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే.. ?
గత కొంత కాలంగా తెలంగాణ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు.. రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లు లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. బిహార్ నేతలకు కేసీఆర్ ప్రాధాన్యం కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే... ఇటీవల రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. దీనిపై స్పందించిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.... ట్రాన్స్ ఫర్లలో తెలంగాణ కేడర్ కి చెందిన ఒక్క ఐపీఎస్ కు కూడా మంచి పదవి దక్కలేదని విమర్శించారు. బిహార్ కు చెందిన అధికారులకే కీలక పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ మూలాలు బిహార్ లోనే ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. విమర్శల తీవ్రతను మరింత పెంచుతూ.... కేసీఆర్ తెలంగాణను.... బిహార్ గూండా రాజ్ గా మారుస్తున్నారని ఆరోపించారు... రఘునందన్ రావు.
కేసీఆర్ .. సొంత రాష్ట్రం వారిని నమ్మరని, బిహార్ అధికారులతో తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని నియంత్రిస్తున్నారని రఘునందన్ విమర్శించారు. అన్ని కీలక స్థానాల్లో బిహార్ అధికారులే ఉన్నారన్న ఆయన... ఈ నియామకాలను తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా అభివర్ణించారు.
కౌంటర్ బిహార్ నుంచి...
బీజేపీ ఎమ్మెల్యే నుంచి విమర్శలకు.. కౌంటర్ బిహార్ నుంచి వ్యక్తం అవుతోంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ కూటమి... రఘునందన్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే బిహార్ ను ఉదహరిస్తూ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్.... ఈ వ్యాఖ్యలు బిహార్ పట్ల బీజేపీ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. బిహార్ బీజేపీ నేతలకు దమ్ముంటే... తెలంగాణలోని వారి పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు.
రఘునందన్ రావు వ్యాఖ్యలు... బీజేపీకి చెంపపెట్టు లాంటివని.. బిహార్ మంత్రి అశోక్ చౌదరి వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులను కేడర్ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారన్న విషయం బీజేపీ నేతలు తెలుసుకోవాలని అన్నారు. బిహార్ అధికారులు కేవలం తెలంగాణలోనే కాదని.. దేశమంతటా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు బిహార్ పట్ల బీజేపీ ఆలోచన విధానాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు.
బీజేపీ ప్రాంతీయ విభేదాలు, రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చూస్తోందని.. ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే బీజేపీ విధానమని... వారెప్పుడూ విభజన రాజకీయాలే చేస్తారని అన్నారు. అవి దేశానికి చాలా ప్రమాదమని అన్నారు.
రఘునందన్ రావు వ్యాఖ్యలపై స్పందించిన బిహార్ బీజేపీ నేత నవాల్ కిశోర్ యాదవ్... అధికారులు పోస్టింగ్, గూండా రాజ్ కామెంట్స్ ని ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగా మాత్రమే చూడాలని అన్నారు. బిహార్ లో కూడా ఇతర రాష్ట్రాల అధికారులు పనిచేస్తున్నారని... దీనినో వివాదంగా చూడొద్దని వ్యాఖ్యానించారు. నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. బిహార్ లో తామెప్పుడూ ఇలాంటి విమర్శలు చేయమని స్పష్టం చేశారు.