Pallavi Prasanth: పరారీలో పల్లవి ప్రశాంత్, పోలీసుల గాలింపు
20 December 2023, 8:55 IST
- Pallavi Prasanth: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైనకేసులో ఏ1గా ఉన్న బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతని అచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.
పరారీలో పల్లవి ప్రశాంత్, పోలీసుల గాలింపు
Pallavi Prasanth: ఫిలిం నగర్ పబ్లిక్ న్యూసెన్స్ ఘటనకు బిగ్ బాస్ సీజన్ -7 విజేత పల్లవి ప్రశాంత్ ప్రధాన కారకుడని జూబ్లీహిల్స్ పోలీసులుఅతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ 2 గా అతడి సోదరుడు పరశురాములు సహా మరి కొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
తనపై కేసు నమోదు అయిందని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉండడం, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉంటాడంతో అతడి అనుచరులను,స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
గజ్వేల్ సమీపంలోని కొలుగురు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ -7 విజేతగా ఎంపిక కాగా, అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు.ఈ నేథ్యంలోనే ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు.అమర్ దీప్ ను విజేతగా ప్రకటించకపోవడం తో అయన అభిమానులు గొడవకు దిగారు.
మరోవైపు విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించాక అయన అభిమానులు సంబరాలు చేసుకుంటూనే అమర్ దీప్ కారు పై దాడి చేశారు.ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. వీరు దాడి చేసుకోవడమే కాక అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సుల పై కూడా రాళ్ళు రువ్వీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
బయట రద్దీని చూసి పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అటుగా వెళ్ళొద్దని హెచ్చరించినా అతడు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ఓపెన్ టాప్ కార్ పై వెళ్ళాడు.దీంతో ఈ విధ్వంసం జరిగిందని పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పల్లవి ప్రశాంత్ కోసం 3 పోలీస్ బృందాలు....
పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్ ను పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అతడి అనుచరులను, డ్రైవర్ సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు.
ప్రస్తుతం ప్రశాంత్ కొమురవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.త్వరలోనే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులపై రాళ్ళు రువ్విన వారి కోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
(కేతిరెడ్డి తరుణ్,హైదరాబాద్ జిల్లా)