తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bharat Jodo Yatra: రాహుల్‌కు సంఘీభావం తెలిపిన రోహిత్ వేముల తల్లి….

Bharat Jodo Yatra: రాహుల్‌కు సంఘీభావం తెలిపిన రోహిత్ వేముల తల్లి….

HT Telugu Desk HT Telugu

01 November 2022, 11:36 IST

google News
  • Bharat Jodo Yatra: తెలంగాణలో భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌ గాంధీకి,  హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల తల్లి  సంఘీభావం తెలిపారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. మంగళవారం శంషాబాద్‌ నుంచి బయలుదేరిన సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకోనుంది. నెక్లెస్‌ రోడ్డులో సాయంత్రం భారీ బహిరంగ సబ నిర్వహించున్నారు. 

తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (HT_PRINT)

తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Bharath jodo తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. నేడు హైదరాబాద్‌లోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించనుంది. శంషాబాద్ మండలం తొండుపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు బహదూర్ పురా చేరుకోనున్న రాహుల్ యాత్ర, ఆ తర్వాత లెగసీ ప్యాలెస్ దగ్గర రాహుల్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు పురానాపూల్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. హుస్సేనీ అలాం జంక్షన్ మీదుగా చార్మినార్ వరకు యాత్ర కొనసాగనుంది. - సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం నెక్లెస్ రోడ్ ఇందిరా విగ్రహం వరకు యాత్ర నిర్వహిస్తారు. - ఇందిరా విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో రాహుల్ ప్రసంగం ఉంటుంది. రాత్రికి బోయిన్ పల్లిలో రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. నేడు జరిగే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారు.

మరోవైపు పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీకి రోహిత్ వేముల తల్లి సంఘీభావం తెలిపారు. 2016లో వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లితో కలిసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం ఇక్కడ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఉదయం యాత్రలో భాగంగా రాధిక వేముల గాంధీతో కలిసి కొద్దిసేపు నడిచారు.

'భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలిపిన ఆమె, రాహుల్ గాంధీతో కలిసి నడిచి, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు, రోహిత్ వేములకి న్యాయం, రోహిత్ చట్టం, దళితులకు, అణగారిన వర్గాలకు ఉన్నత న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యం, అందరికీ విద్య దక్కాలంటూ సమావేశం అనంతరం రాధిక వేముల ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి భారత్ జోడో యాత్రలో గాంధీతో కలిసి నడుస్తున్న రాధిక వేముల చిత్రాలను ట్వీట్ చేశారు. జనవరి 17, 2016న 26 ఏళ్ల దళిత విద్యార్థి మృతితో ఉన్నత విద్యా సంస్థల్లో కులతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలవడం తెలిసిందే.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు….

నవంబర్ 1వ తేదీన తొండుపల్లి - శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తలపెట్టిన “భారత్ జోడో యాత్ర” దృష్ట్యా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవి రంగనాథ్ తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్ - అరమ్‌ ఘర్‌ - నేషనల్ పోలీస్ అకాడమీ-హసన్‌నగర్ స్ట్రెచ్ మధ్య ఆంక్షలు ఉంటాయి. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు చార్మినార్ నుండి నెక్లెస్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రకారం, పాదయాత్ర హుస్సేని ఆలం, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, రవీంద్ర భారతి, ఆర్‌బీఐ, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరాగాంధీ మీదుగా సాగుతుంది. ఐమాక్స్‌ సర్కిల్/నెక్లెస్ రోడ్డు రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

రాహుల్ గాంధీ కూడా చార్మినార్‌ ప్రాంతంలో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. దీంతో నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల పాటు పాదయాత్ర సాగనుంది. సాధారణ ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో/ఎంఎంటీఎస్ లేదా ఔటర్ రింగ్ రోడ్డును ఉపయోగించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు మరియు ట్రాఫిక్ రద్దీ పాయింట్లను గమనించి, వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

తదుపరి వ్యాసం