Online Aksharabhyasam : బాసర ఆలయం.. ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసం
21 November 2022, 22:24 IST
- Basara Temple : బాసర ఆలయం అంటే ముందుగా గుర్తొచ్చేది చిన్నారులకు అక్షరాభ్యాసం. అయితే ఈ విధానాన్ని ఆన్ లైన్ లో తీసుకురావాలని దేవాదాయ శాఖ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
బాసర ఆలయం
బాసర(Basara)లోని సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసం (Aksharabhyasam)కార్యక్రమాన్ని ఆన్‌లైన్(Online)లో చేయాలని దేవాదాయ శాఖ యోచిస్తోంది. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం ద్వారా చదువుపై ఆసక్తి ఉంటుంది.. గొప్పగా చదవుతారనే భక్తులు నమ్ముతుంటారు. అయితే అక్షరాభ్యాసం విధానాన్ని ఆన్ లైన్ లో కూడా చేయించాలని దేవాదాయశాఖ అనుకుంటోంది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో 'అక్షరాభ్యాసం' చేయడం ద్వారా తమ పిల్లలను విద్యాభ్యాసంలో చురుకుగా ఉంటారని, దేశం నలుమూలల నుండి తల్లిదండ్రులు బాసర ఆలయానికి తరలివస్తారు. ప్రతి సంవత్సరం, నాలుగు లక్షల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు. 40,000 మంది బాసర ఆలయం(Basara Temple) ప్రాంగణంలో 'అక్షరాభ్యాసం' చేస్తారు.
పవిత్రమైన రోజులలో అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులతో రద్దీగా కనిపిస్తుంది. రద్దీ దృష్ట్యా ఎక్కువ మంది భక్తులకు సేవలు అందించేలా.. అధికారులు యోచిస్తున్నారు. ఆన్ లైన్ విధానం అయితే ఎక్కువ మందికి సేవలు అందించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.
ఇటీవల సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం(Ganesh Temple)లో ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టారు. ఆలయ సేవల డిజిటలైజేషన్ మొదటి దశలో వచ్చిన అపూర్వ స్పందన మరిన్ని పుణ్యక్షేత్రాలకు విస్తరించే ఆలోచనలో అధికారులను ఉన్నారు. రెండో దశలో బాసర ఆలయంలో ఆన్‌లైన్(Online) సేవలను ప్రవేశపెట్టనున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే 'అక్షరాభ్యాసం' పొందిన వారికి అక్షతలు, స్లేట్, స్లేట్ పెన్సిల్, ప్రసాదం పోస్ట్ ద్వారా అందజేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
దేశంలోనే రెండో సరస్వతీ దేవి ఆలయం(Saraswati Temple)గా బాసర ఉంది. గోదావరి నది(Godavari River) ఒడ్డున చక్కటి వాతావరణంలో అమ్మవారు ఇక్కడ కొలువుదీరారు. నిత్యం పూజలందుకుంటారు. వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందని పురాణాలు చెబుతున్నాయి. వేదవ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ల ఇసుక తీసుకువచ్చాడని, సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవత మూర్తులను ప్రతిష్టించాడని చెబుతుంటారు. చాళక్యరాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని అంటుంటారు.
సరస్వతీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం(Aksharabhyasam) చేయించేందుకు భక్తులు ఉత్సహం చూపిస్తారు. జిల్లా కేంద్రానికి నుంచి 70 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్(Hyderabad) నుంచి 205 కిలోమీటర్ల దూరం. ఇక్కడకు నిత్యం మహారాష్ట్ర, నిజామాబాద్, నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు వస్తుంటారు. బాసరకు వెళ్లేందుకు రైలుమార్గం(Train Route) కూడా ఉంది.