తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Group 1 Agitation : హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్

Group 1 Agitation : హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్

19 October 2024, 14:07 IST

google News
    • Group 1 Agitation : హైదరాబాద్‌లో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావం ప్రకటించారు. అశోక్ నగర్ వచ్చి అభ్యర్థుల సమస్యలు తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్
గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్

గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్

హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. వీరికి కేంద్రమంత్రి బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ రాకతో.. అశోక్ నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే దారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను రీ షెడ్యూల్‌ చేయాలని, మొండిగా వ్యవహరించవద్దని బండి సంజయ్ సూచించారు. గ్రూప్‌ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అభ్యర్థులను అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏంటని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్‌నగర్‌ వెళ్లి గ్రూప్‌ 1 అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతానని స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవో 29ని తీసుకువచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా.. కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణను మొహబ్బత్‌ కి దుకాన్‌ చేస్తానని.. రాహుల్‌ గాంధీ ఎన్నికలప్పుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

గ్రూప్ 1పై ఆందోళనలు.. కారణాలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను జారీ చేసింది. 503 ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 2022లో జరిగింది. అయితే ప్రశ్నపత్రం లీక్ కావటంతో ఈ పరీక్ష రద్దు అయింది. జూన్ 2023లో మరోసారి ప్రిలిమినరీ పరీక్ష మళ్లీ నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు, అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా మరోసారి రద్దు చేయాల్సి వచ్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఫిబ్రవరి 2024లో కొత్త నోటిఫికేషన్ జారీ అయింది. అదనంగా 60 పోస్టులను కలుపుతూ మొత్తం 563 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు కొత్త అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది.

జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… జులై 7వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు కటాఫ్ తో పాటు పలు అంశాలపై ప్రస్తుతం అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. 2022లో వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ ప్రకారం… మెయిన్స్ పరీక్షకు జీవో 55 ప్రకారం ఎంపిక చేసేలా పేర్కొన్నారని అభ్యర్థులు చెబుతున్నారు. రిజర్వేషన్ల నియమాన్ని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో వర్తింపజేసేలా ఉందని వివరిస్తున్నారు. అయితే 2024 నోటిఫికేషన్ లో జీవో 55ని సవరిస్తూ…జీవో 29ని తీసుకొచ్చారని చెబుతున్నారు.

జీవో 29 ప్రకారం… ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల ఎంపిక కోసం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను విస్మరించారని గ్రూప్ 1 అభ్యర్థులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకు ఒక ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థి అధిక మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో పోటీ చేయడానికి అర్హులైనప్పటికీ… వారిని రిజర్వ్‌డ్ కేటగిరీ కింద తీసుకుంటున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. ఇది పూర్తిగా రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా ఉందంటున్నారు. జీవో 29 ప్రకారం… కొత్త నోటిఫికేషన్ లో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చశారని… ఫలితంగా చాలా మంది రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు మెయిన్స్ రాసే అవకాశం కోల్పోయారని చెబుతున్నారు.

జీవో 55 ప్రకారం… ఓపెన్ కేటగిరిలో మార్కులు సాధించిన అభ్యర్థులు రిజర్వేషన్ల పరిధిలోకి రారని అభ్యర్థులు చెబుతున్నారు. కానీ 29 జీవో ప్రకారం... ఓపెన్ కేటగిరిలో అధిక మార్కులు సాధించినప్పటికీ చాలా మంది అభ్యర్థులను రిజర్వేషన్ల కింద కాన్సిడర్ చేశారని చెబుతున్నారు.

కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల సమయంలో మెయిన్స్ కు 31,382 అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ తెలిపిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 34,383కు చేరిందని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య పెరగటానికి గల కారణాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

జీవో 55 ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని, జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గత నోటిఫికేషన్‌ ఆధారంగానే పరీక్ష నిర్వహించాల్సి ఉండగా తాజా నోటిఫికేషన్‌ జారీ చేయడం సరికాదని అభ్యర్థులు చెబుతున్నారు. దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, కొత్తగా ఏర్పడిన అదనపు ఖాళీలకు ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ప్రిలిమ్స్ కీలో కూడా తప్పులున్నాయని… వీటిపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి కీ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు.

జీవో 29ను సవాల్ చేస్తూ పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై అక్టోబర్ 21వ తేదీన విచారణ జరగనుంది. మరోవైపు ఇదే తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 27వ తేదీ ముగుస్తాయి.

తదుపరి వ్యాసం