తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay On Tspsc : టీఎస్పీఎస్సీ అన్ని ప్రశ్నాపత్రాలూ లీక్ అయ్యాయి

Bandi Sanjay On TSPSC : టీఎస్పీఎస్సీ అన్ని ప్రశ్నాపత్రాలూ లీక్ అయ్యాయి

HT Telugu Desk HT Telugu

14 March 2023, 16:42 IST

google News
    • Bandi Sanjay On Paper Leak : కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందని చెప్పారు.
బండి సంజయ్
బండి సంజయ్

బండి సంజయ్

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంపై ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారని పేర్కొన్నారు. అత్యధికంగా ప్రవీణ్ కు 103 మార్కులొచ్చాయని, అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను బండి సంజయ్ ప్రస్తావించారు. ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే.. ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని పేర్కొన్నారు.

దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు టీఎస్పీఎస్సీ స్పందించలేదని బండి సంజయ్ చెప్పారు. దీనివెనుక పెద్ద మతలబు ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు టీఎస్పీఎస్పీ పెద్దల పాత్ర లేనిదే ఇలాంటి ఘటన జరగడం అంత సులువు కాదని అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీకేజీ అయ్యాయనే అనుమానం కలుగుతోందన్నారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం సైతం కేసీఆర్ టీం వద్ద ఉందనే సమాచారం తమవద్ద ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడంతోపాటు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ప్రకటనను విడుదల చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంతులేని రీతిలో కొనసాగుతోందని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగాలకున్న డిమాండ్‌ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలురైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరమని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో పని చేసే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నారన్నారు. కానీ పరీక్షపత్రం లీకేజి వ్యవహారం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసిందన్నారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు సమాచారం అందుతోందని చెప్పారు.

ఇంకా బండి సంజయ్ ఏం మాట్లాడారంటే

ఇవి మాత్రమే కాకుండా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ముందుగానే గ్రూప్-1 ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను సేకరించి పరీక్ష రాశారు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే... ప్రవీణ్ కోసం పరీక్ష రాసే సమయ వేళలను కూడా మార్చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ఓ పత్రికలో వార్త వచ్చేదాకా టీఎస్పీఎస్సీ స్సందించనేలేదు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలొస్తున్నాయి

తమకు వస్తున్న ఫిర్యాదులు, సమాచారాన్ని పరిశీలిస్తే.. టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ కుటుంబానికి ముందుగానే చేరుతున్నాయని అర్థమవుతోంది. రాబోయే 2 నెలల్లో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం సైతం కేసీఆర్ కుటుంబీకుల వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా ఇటువంటి లీకేజీలు పెద్ద ఎత్తున జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో లీకేజీ వీరులు చెలరేగిపోతున్నారు. 2018లో పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్ష పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా లీక్‌ కావటం, ఎంసెట్ పశ్నాపత్రాల లీకేజీ వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షం కావటం విద్యార్థుల్లోనూ తల్లితండ్రుల్లోనూ ఆందోళనకు దారితీసింది. లేనిపోని నిబంధనల పేరుతో కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల్లోనూ అనేక అవకతవకలు జరిగిన విషయం సైతం అనేక ఆందోళనలకు తావిస్తోంది.

టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ ఛైర్మన్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఛైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యం. క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క ఉద్యోగి కంప్యూటర్లో ఉండటానికి వీల్లేదు. అట్లాంటిది ఒక సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు ఎట్లా ప్రత్యక్షమవుతాయి? వాటిని ప్రవీణ్, రాజశేఖర్ ఎట్లా పెన్ డ్రైవ్ లోకి తీసుకుంటారు? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి ప్రమేయం లేకుండా ఇది అసాధ్యం?

దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం తేలికగా కొట్టిపడేసేందుకు యత్నిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్, మరికొందరు కిందిస్థాయి ఉద్యోగులు మాత్రమే ఈ మొత్తం కుట్రకు బాధ్యులను చేసి తమ తప్పులను కప్పిపచ్చుకునేందుకు పెద్ద స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. తెలంగాణలో ఉద్యోగాలను భర్తీ చేయడం సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. తెలంగాణను ఆర్థికంగా పూర్తిగా దివాళా తీయించిన కేసీఆర్ కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేని స్థితిలో ఉన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయడం అసాధ్యమని తెలిసి... నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు. అందులో భాగంగానే గ్రూప్-1సహా ఇతర పరీక్షా పత్రాలన్నీ లీకేజీ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

టీఎస్పీఎస్పీ నియమకాల్లోనూ ఛైర్మన్, కార్యదర్శులతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ జోక్యం చేసుకుని తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వారికి అభయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

తదుపరి వ్యాసం