Bandi Sanjay : హిందూ సమాజం సంఘటితం కావాలన్న బండి సంజయ్…
05 September 2022, 14:23 IST
- దేశంలో హిందూ సమాజం ఏకం కావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కులాలు, వర్గాల పేరుతో చీలిపోతే తెలంగాణకు ప్రమాదకరమన్నారు. తరుణ్ చుగ్ తో కలిసి ఖైరతాబాద్ మహాగణపతిని బండి సంజయ్ దర్శించుకున్నారు.
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న బండి సంజయ్
హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకుంటే హిందువులంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో కలిసి ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని 20 కేజీల లడ్డూను వినాయకుడికి సమర్పించారు. అనంతరం తరుణ్ చుగ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు గౌతమ్ రావు తదితరులు గణపతిని దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బండి సంజయ్, తరుణ్ చుగ్ ను ఘనంగా సన్మానించారు.
భాగ్యనగర్ లో అతి శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, దశాబ్దాలుగా మహా గణపతిని ప్రతిష్టిస్తూ ధార్మిక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆ రోజు బ్రిటీష్ వారిని తరిమి కొట్టడానికి హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారని, ఇప్పుడు కూడా కులాలు, మతాలకు అతీతంగా సంఘటితం కావాలన్నారు. హిందూ సమాజాన్ని కులాలు, వర్గాలు, వర్ణాలు, సంఘాల పేరుతో చీల్చే ప్రమాదం నుండి తప్పించి హిందూ సమాజాన్ని సంఘటితంగా మార్చడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
మనతోపాటు సమాజం కూడా బాగుండాలని కోరుకునే వాడే నిజమైన హిందువని, నిస్వార్థంగా భగవంతుడిని కొలవాలని హిందువుగా పుట్టడం మన పూర్వ జన్మసుక్రుతమన్నారు. వారానికో పండుగ.. రోజుకో దేవుడిని కొలిచే గొప్ప సంస్కృతి హిందువులకే సొంతమన్నారు. నిరంతరం హిందూ సమజాం జాగ్రుతం కావాలని కులాల, వర్గాల, వర్ణాల, సంఘాల పేరుతో హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు అత్యంత ప్రమాదకరం అన్నారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.