Nandamuri Balakrishna: ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన బాలకృష్ణ,పురంధేశ్వరి
28 May 2024, 8:26 IST
- Nandamuri Balakrishna: నందమూరి తారకరామారావు 101 జయంతి సందర్భంగా సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన బాలకృష్ణ, రామకృష్ణ
Nandamuri Balakrishna: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబsa సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, రామకృష్ణ, కుమార్తె పురందేశ్వరి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ అంటే నవజాతికి మార్గదర్శనం అని, నానా జాతులకు దైవ సమానుడని, ఒకే పంథాలో వెళుతున్న ఏపీ రాజకీయాలను మార్చిన తెలుగు తేజం అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
అంతకు ముందు సామాన్య ప్రజలకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదని, చాలామందికి తెలిసేది కాదని, కొందరికే పరిమితమైన రాజకీయాల్లోకి గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, లాయర్లు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, పీడిత వర్గాలను రాజకీయాల్లోకి ఆహ్వానించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన పథకాలకు ప్రజలకు ఎంతో సానుకూలమైనవని, ప్రజలకు మేలు చేసినవన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిన అభినవ అంబేడ్కర్, భగీరథుడు.. నందమూరి తారకరామారావు అని బాలకృష్ణ అన్నారు.
పేదల ఆకలి తీర్చి, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చిన అన్న అన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారని చెప్పారు. చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు.
చదువుకునే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చినా చదువు పూర్తి చేసిన తర్వాత నటనలోకి వచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో విప్లవాత్మక సంస్కరణలకు ఎన్టీఆర్ ఆద్యుడిగా నిలిచారన్నారు. మహిళల కోసం పద్మావతి విశ్వవిద్యాలయం, తెలంగాణలో జీవో 16 అమలు చేయడం వంటి విషయాల్లో ఎన్టీఆర్‌కు ఎవరు సాటిలేరన్నారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు.
పురందేశ్వరి నివాళులు…
ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. 320సినిమాలకు పైగా నటించి ఎన్నో పాత్రలలో జీవించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రాజకీయాలు అధికారం కోసమే కాదని, సేవా మర్గంగా భావించారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. తెలుగువారికి ప్రత్యేక భాష, ఉనికి, చరిత్ర ఉందని గుర్తించడానికి ఎన్టీఆర్ కృషి చేశారన్నారు.