కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ మేయర్… ఢిల్లీకి రేవంత్ రెడ్డి
03 July 2022, 12:13 IST
- అధికార టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్‌లోకి బడంగ్ పేట్ మేయర్
chigirintha parijatha join in congress: గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి కూడా పార్టీని వీడారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. బడంగ్ పేట అభివృద్ధి కాంక్షించి పార్టీ లో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని పేర్కొన్నారు.
క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతోనే తాము సేవలందించామని. కానీ గడిచిన కొంతకాలంగా తమ పట్ల వ్యతిరేక భావనతో ఉండడంతోనే, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో తమ ఉన్నతిని ఓర్వలేక రాజకీయంగా చేస్తున్న కక్ష సాధింపును ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ఆమె వివరించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు.
నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి...
ఇక ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరికలు ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ పారిజాత నర్సింహారెడ్డినే కాకుండా మరికొందరు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిసింది.