Mulugu district : తాడ్వాయి అడవిలో ఆక్రమణ..! అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై ఇనుపరాడ్లతో దాడి
27 September 2024, 22:12 IST
- ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో కొందరు వ్యక్తులు చెట్లను ధ్వంసం చేసి ఆక్రమణకు యత్నించారు. జేసీబీ సాయంతో కొంత స్థలాన్ని చదును చేసి వెళ్తుండగా… అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. వెహికిల్ ను సీజ్ క్రమంలో సదరు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఫారెస్ట్ అధికారులపై హత్యాయత్నం - పరామర్శించిన మంత్రి సురేఖ
ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ లో గురువారం అర్ధరాత్రి ఘోర ఘటన జరిగింది. కొంతమంది దుండగులు దామెరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను ధ్వంసం చేసి ఆ స్థలాన్ని చదును చేస్తుండగా.. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకుని జేసీబీని ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో జేసీబీ ఓనర్ తో పాటు మరో నలుగురు కలిసి ఫారెస్ట్ ఆఫీసర్లపై ఇనుప రాడ్లతో హత్యా ప్రయత్నం చేశారు. దీంతో జిల్లా అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ దామెరవాయి అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి దామెరవాయి గ్రామానికి చెందిన గంటా సూరజ్ రెడ్డి అలియాస్ గున్ను, గంటా శశిధర్ అలియాస్ చంటి, పాండవుల సాయి, నీరటి శ్రీకాంత్, మాధరి చంటి గ్రామ శివారుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు కొన్నిచెట్లను తొలగించి చదును చేశారు. జేసీబీతో ఆ ల్యాండ్ ను చదును చేసి అర్ధరాత్రి సమయంలో తిరిగి దామెరవాయి గ్రామానికి వెళ్తున్నారు.
విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు శరత్ చంద్ర, సుమన్ గ్రామ శివారుకు చేరుకుని జేసీబీని అడ్డుకున్నారు. ఆ వెహికిల్ ను స్వాధీనం చేసుకుని అటవీశాఖ ఆఫీస్ కు తరలించేందుకు రెడీ అయ్యారు.
ఇనుపరాడ్లతో హత్యాయత్నం
జేసీబీని ఫారెస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండటంతో సూరజ్ రెడ్డి, అతని అనుచరులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో వారిపై దాడికి దిగారు. దీంతో ఫారెస్ట్ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేసినా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
ఇందులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ తల వెనుక భాగంలో మూడు చోట్ల తీవ్ర గాయాలు కాగా.. తీవ్రంగా రక్త స్రావం జరిగింది. ఎఫ్బీవో శరత్ చంద్ర కూడా తీవ్రంగానే గాయపడ్డారు. వారి వెంట ఉన్న బేక్ క్యాంప్ ఉద్యోగి ఎట్టి శ్రీను, డ్రైవర్ రాజేందర్ పై కూడా దాడికి ప్రయత్నించగా.. వారు పరుగెత్తారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉద్యోగులను అక్కడే వదిలేసి సూరజ్ రెడ్డి గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది.
అనంతరం ఇతర ఉద్యోగుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు హుటహుటిన అక్కడికి చేరుకుని వారిద్దరినీ వరంగల్ నగరంలో గార్డియన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డీఆర్వో ఈ.కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తాడ్వాయి పోలీసులు.. సూరజ్ రెడ్డితో పాటు శశిధర్, సాయి, శ్రీకాంత్, చంటిని శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
పరామర్శించిన అటవీశాఖ మంత్రి సురేఖ
దుండగుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రను రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ నేరుగా గార్డియన్ ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై వారితో మాట్లాడి వివరాలు సేకరించారు.
దాడికి పాల్పడిన వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ములుగు ఎస్పీ శబరీష్ కు ఆదేశాలు జారీ చేశారు. అడవులను కాపాడే ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడటం దారుణమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ ఉద్యోగులకు ఆయుధాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కొండా సురేఖ భరోసా ఇచ్చారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).