Khammam Congress : ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకున్న వైనం
29 February 2024, 9:56 IST
- Khammam Congress: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ పై హత్యాయత్నం కలకలం రేపింది. వివాహ వేడుకల నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో దాడి Attack జరిగింది.
ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం
Khammam Congress: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం కలకలం రేపింది. కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కొణిజర్ల Konijarla గ్రామ మాజీ సర్పంచ్ Ex Sarpanch సూరంపల్లి రామారావు పై ఇద్దరు దుండగులు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశారు.
మండల కేంద్రంలోని ఆయన నివాసానికి ఎదురుగా ఉన్న ఇంట్లో బుధవారం రాత్రి వివాహం జరిగింది. కాగా ఆ వివాహానికి హాజరైన రామారావు రాత్రి 12 గంటల సమయం దాటే వరకు అక్కడే గడిపారు.
అనంతరం తన ఇంటి ఆవరణలోకి చేరుకుని ఇంట్లోకి వెళుతుండగా లోపలికి చొరబడిన ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ కడుపులో కత్తి పోట్లు పడ్డాయి.
ఆయన తల్లి గమనించి కేకలు వేయడంతో దుండగులు గోడ దూకి పారిపోయారు. తీవ్ర రక్తశ్రావం అవుతున్న రామారావు వెంటనే ఇంటి ముందు జరుగుతున్న వేడుక వద్దకు చేరుకుని కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన రామారావును ఖమ్మంలో ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించే ప్రమాదాన్ని గమనించి మెరుగైన చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నారు.
వివాదాల నేపథ్యంలోనే..
గత వివాదాల నేపథ్యంలో నే మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావుపై దుండగులు దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఒక భూ వివాదానికి సంబంధించిన వ్యక్తులే ఈ ఆగడానికి తెగబడినట్లు ప్రచారం జరుగుతోంది.
సరిగ్గా మూడేళ్ళ కిందట కూడా ఇంటికి కారులో వచ్చిన కొందరు దుండగులు దాడికి యత్నించగా ఆయన తప్పించుకున్నారు. తాజాగా జరిగిన దాడిలో మాత్రం రామారావు తీవ్రంగానే గాయపడ్డారు.
అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ నాయకుడిపై కాపుకాసి చేసిన హత్యాయత్నం కలకలం సృష్టించింది. హత్యాయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.