తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aruri Ramesh: లోక్‌సభ వైపు ఆరూరి రమేష్ చూపు…

Aruri Ramesh: లోక్‌సభ వైపు ఆరూరి రమేష్ చూపు…

HT Telugu Desk HT Telugu

13 December 2023, 7:15 IST

google News
    • Aruri Ramesh: ఓటమే ఉండదనుకున్న వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ కు అసెంబ్లీ ఎన్నికలు ఘోర పరాభవాన్ని రుచిచూపించాయి. కొద్దిగొప్ప ఓట్లతోనైనా బయటపడతాననుకున్న తనకు ఓటమినే పరిచయం చేశాయి.
లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్న ఆరూరి రమేష్
లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్న ఆరూరి రమేష్

లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్న ఆరూరి రమేష్

Aruri Ramesh: ఎమ్మెల్యే ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన ఆరూరి రమేష్ పదవి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఓటమి చెందిన తరువాత నాలుగైదు రోజుల నుంచే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుండటం, తరచూ కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తుండటం వల్ల కూడా అరూరి రమేశ్​ లోక్​ సభ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఓటమితో అంచనాలు తలకిందులు

వర్ధన్నపేట బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అరూరి రమేశ్​ 2014, 2018 ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నారు. 2014లో 86,349 మెజారిటీ, 2018 ఎన్నికల్లో ఏకంగా 99,240 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈసారి లక్ష మెజారిటీ టార్గెట్ పెట్టుకుని బరిలో నిలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకోవడంతో పాటు తమపార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతోనే ప్రచారం చేసుకున్నారు.

కానీ ఆ ఓవర్​ కాన్ఫిడెన్సే ఆయనను దెబ్బతీసింది. ఎలాగైనా గెలిచేది తానేనన్నా అతి విశ్వాసంతో పాటు లోకల్​ క్యాడర్​ తీరుతో అరూరిపై వ్యతిరేకత పెరిగిపోగా.. జనాలంతా హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో హ్యాట్రిక్​ ఎమ్మెల్యే అవుదామనుకున్న అరూరి రమేశ్​.. అనూహ్యంగా ఓటమిని మూటగట్టుకున్నారు.

ఆరు నెలల్లో ఎన్నికలు.. టికెట్ కోసం ప్రయత్నాలు

వరంగల్ లోక్​ సభ నియోజకవర్గ పరిధిలో వరంగల్​ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, స్టేషన్​ ఘన్​ పూర్​ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వరంగల్ లోక్​ సభ స్థానం ఎస్సీ రిజర్వ్​ కాగా.. ప్రస్తుతం పసునూరి దయాకర్​ ఎంపీగా కొనసాగుతున్నారు. గత రెండు పర్యాయాలు ఆయనే పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆయన ఎప్పుడూ ప్రజల్లో కనిపించకపోవడం, ముఖ్యమైన మీటింగులకు కూడా హాజరుకాకపోవడంతో లీడర్లు, కార్యకర్తల్లో ఆయనపై కొంతమేర వ్యతిరేకత ఉంది.

దీంతోనే ఆ స్థానంపై అరూరి రమేశ్​ కన్నేశారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా.. ఎంపీగానైనా రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన లోక్​ సభ టికెట్​ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి ఎంపీగా బరిలో నిలిచేందుకు ఆయన తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కార్యకర్తలు, నేతలతో సమావేశాలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎంపీ టికెట్ కోసం ఇప్పటి నుంచే కిందిస్థాయి క్యాడర్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. వరుసగా మీటింగ్​ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తన అనుచరులకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న విషయం గురించి క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది.

ఇటీవల హంటర్​ రోడ్డులోని సీఎస్​ ఆర్​ గార్డెన్​ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో చాలామంది ఇదే విషయాన్ని అరూరి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కిందిస్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతోనే ఆయన ఎంపీ బరిలో నిలవనున్నారనే ప్రచారం జోరందుకుంది.

నియోజకవర్గాల్లో నెగ్గుకొచ్చేనా..?

ఇప్పటికే కాంగ్రెస్​ ఫుల్ మెజారిటీ సంపాదించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పది స్థానాల్లో విజయం సాధించింది. కేవలం రెండు సెగ్మెంట్లలోనే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదిలాఉంటే వరంగల్ లోక్​ సభ నియోజకవర్గంలోని ఒక్క స్టేషన్ ఘన్​ పూర్​ తప్ప మిగతా వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలుపుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలాఉంటే ప్రస్తుత ఎంపీ పదవీకాలం 2024 ఏప్రిల్​ నెలాఖరుతో ముగియనుండగా.. అప్పటిలోగా పార్టీని స్ట్రాంగ్​ చేసుకునే పనిలో అరూరి నిమగ్నమయ్యారు. ఓ వైపు ఎంపీ బరిలో ఉన్నాననే విషయం పార్టీ కార్యకర్తలకు సూచాయకంగా చెబుతూనే మరోవైపు ఎంపీ టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్​ హాస్పిటల్​ లో ఉండగా.. ఇటీవల ఆయనను పరామర్శించి కూడా వచ్చారు.

అన్నీ సక్రమంగా జరిగితే ఎంపీ టికెట్ వస్తుందనే ధీమాతో అరూరి ఉన్నట్లు తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్​ గతంతో పోలిస్తే స్ట్రాంగ్​ అవడం, ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే ఉండటం అరూరికి మైనస్​ కాగా.. ఇంకా ఆరు నెలల్లో ఏమైనా మార్పులు జరిగితే వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. కాగా అరూరి రమేశ్​ లోక్​ సభ స్థానం వైపు వేస్తున్న అడుగులు ఎంతమేర ఆయనకు అనుకూలిస్తాయో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం