తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Most Wanted Criminal: హత్యలు, దందాలతో బెంబేలెత్తిస్తున్న మోస్ట్‌ వాంటెడ్ అరెస్ట్

Most Wanted Criminal: హత్యలు, దందాలతో బెంబేలెత్తిస్తున్న మోస్ట్‌ వాంటెడ్ అరెస్ట్

HT Telugu Desk HT Telugu

27 October 2023, 7:01 IST

google News
    • Most Wanted Criminal: హైదరాబద్ పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను గురువారం అరెస్ట్ చేశారు.హత్యలు,సెటిల్ మెంట్లు,కిడ్నాప్లు, భూకబ్జాలు చేస్తూ ఏకంగా ఇప్పటివరకు రూ.100 కోట్ల వరకు సంపాదించి ఉంటాడని హైదరాబాద్ పోలీసులు అంచనా వేస్తున్నారు.
మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ ఖైజిర్
మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ ఖైజిర్

మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ ఖైజిర్

Most Wanted Criminal: హైదరాబాద్‌లో మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతని హిస్టరీ చూసి షాక్ అయ్యారు. హత్యలు, సెటిల్‌మెంట్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.

హబీబ్ నగర్ పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్ పోలీసులతో కలిసి గ్యాంగ్ స్టర్ ను పట్టుకున్నారు. పోలీస్‌ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న మొహమ్మద్ ఖైజర్ అలియాస్ ఖైజార్ అలియాస్ చోర్ ఖైజర్ అలియాస్ మల్లేపల్లి ఖైజర్ (52) అనే రౌడీ షీటర్ రకరకాల పేర్లతో గత కొన్నేళ్లుగా చలామణి అవుతున్నాడు.

గుడి మల్కాపూర్ ప్రాంతానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి మొహమ్మద్ ఖైజర్‌ను కలిశాడు. యాదగిరి అన్న రాజు హత్య కేసులో నిందుతులను చంపాలని మొహమ్మద్ ఖైజ‌ర్‌ను కోరాడు. అందుకు అంగీకరించిన మొహమ్మద్ ఖైజర్ రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో యాదగిరి అందుకు ఒప్పుకున్నాడు. యాదగిరి చెప్పిన పనిని చేయడంలో ఖైజర్ విఫలం అయ్యాడు.

డబ్బులు తీసుకొని ఎందుకు పని చెయ్యలేదు అని యాదగిరి ప్రశ్నించడంతో ఇంకో రెండు లక్షలు ఇస్తే పని పూర్తి చేస్తానని చెప్పాడు. అతని వేధింపులు తాళలేక మరో రెండు లక్షలు మొహమ్మద్ ఖైజర్‌కు యాదగిరి ఇచ్చాడు.

అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలని మొహమ్మద్ ఖైజర్ ఒత్తిడి చెయ్యడంతో యాదగిరి హబిబ్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొహమ్మద్ ఖైజిర్ చరిత్ర మొత్తం బయటపెట్టారు.అతని నేర చరిత్ర చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఖైజిర్ అమాయక ప్రజలను కత్తులతో బెదిరించి డబ్బులు వసూలు చేసే వాడని, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని హత్యలు,కిడ్నాప్ లు, భూకబ్జాలు,సెటిల్ మెంట్లు చేసే వాడని పోలీసులు చెబుతున్నారు.

1995 లో వ్యక్తిగత కక్షతో తన స్నేహితుడు అఖిల్‌తో కలిసి నాంపల్లి లో అఫ్జల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తు చేశారు.ఆ హత్య కేసులో జైలుకు వెళ్లిన మొహమ్మద్ ఖైజిర్...జైల్ నుండి బయటికి వచ్చి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తూ వచ్చాడని పోలీసులు తెలిపారు.ఖైజిర్ పై 23 క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

దందాలు, సెటిల్మెంట్లతో మోసాలకు పాల్పడుతూ ఇప్పటివరకు రూ.100 కోట్లు సంపాదించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.ఖైజిర్‌పై గతంలో పిడి ఆక్ట్ కూడా నమోదైందని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఖైజిర్‌ను రిమాండ్‌కు తరలించారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

తదుపరి వ్యాసం