Basara Dasara: బాసరలో వైభవంగా 'దేవీ' శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు... అక్షర పూజలకు ప్రత్యేక సదుపాయాలు
03 October 2024, 6:56 IST
- Basara Dasara: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా గోదావరి నది తీరాన కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రుల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు కళ్లరా వీక్షించడానికి దేశ నలుమూల నుంచి వేలాది భక్తులు హాజరు కానున్నారు.
గోదావరి నది వెంబడి ఉన్న బాసర సరస్వతీ దేవి ఆలయం
Basara Dasara: బాసర క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉండడంతో ఇక్కడ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. తొమ్మిది రోజుల పాటు ముగ్గురు అమ్మవార్లను కొలిచేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవార్లకు దేవాదాయ శాఖ తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది.దేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంతో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వడం సంప్రదాయం.
నవ రూపాల్లో అమ్మవార్ల దర్శనం
మొదటి రోజు శైలపుత్రిగా,
రెండవ రోజు బ్రహ్మచారిని గా,
మూడవ రోజు చంద్రగంట గా,
నాల్గవ రోజు కుష్మాండ అవతారంలో ,
ఐదవ రోజు స్కంద మాత అవతారం లో,
ఆరవ రోజు కాత్యాయని అవతారం గా,
ఏడవ రోజు కాలరాత్రి అలంకారంలో,
ఎనిమిదవ రోజు మహా గౌరీ గా ,
తొమ్మిదవ రోజు సిద్ధ ధాత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ తొమ్మిది రోజులు అమ్మవార్లకు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి సమర్పిస్తారు.
దేశంలోనే రెండో సరస్వతి ఆలయం
దేశంలోనే సరస్వతి ఆలయం ఒకటి కాశ్మీర్ రాష్ట్రంలో ఉండగా మరొకటి తెలంగాణ రాష్ట్రం బాసరలో ఉంది. మూల నక్షత్రం రోజు అమ్మవారి పుట్టినరోజు, ఈ సందర్బంగా క్షేత్రంలో అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరభ్యాసం నిర్వహిస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి భక్తులు తమ చిన్నారులకు అక్షర స్వీకార పూజలు జరిపించడానికి ఈ ప్రత్యేక మైన రోజు వేల సంఖ్యలో తరలివస్తారు.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున అక్షర శ్రీకర పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పోలీసులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన అమ్మవారి ఆలయం 'బాసర'(వ్యాసపురి)
బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి, తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చారు. ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై కుటీరం నిర్మించారు. ఆ కుటీరంలో తపస్సు చేయడం ప్రారంభించాడు.
వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురు అమ్మవార్లకు ఆలయాన్ని నిర్మించమని సూచించింది. వ్యాసుడు నది లోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులును ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలం నివసించాడని పురాణ కథనాలు ఉన్నాయి. కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి పిలిచే వారు.
‘బాసర’ గా నామాంతరం, 200 ఏళ్ల కింద పునర్నిర్మాణం…
ఆరో శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగాన, శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాస లింగం ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఎనిమిది (ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం) పుష్కరిణులున్నాయి .
బాసర కు ఇలా రావొచ్చు..
బాసర క్షేత్రానికి రైళ్లు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో వచ్చే వారు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసరకు 207 కిలో మీటర్లు దూరం ఉంటుంది. జిల్లా కేంద్రమైన నిర్మల్ పట్టణం నుంచి 75 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నిజామాబాద్ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో బాసర ఉంది. సికింద్రాబాద్ నుంచి బాసర నేరుగా రైళ్లు ఉన్నాయి. హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.
నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు : ఈఓ విజయరామారావు.
బాసర క్షేత్రంలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈఓ విజయ రామారావు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అక్షర శ్రీకర పూజలకు వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నదానం, వసతి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రత్యేక అక్షరాభ్యాసం మండపాలు, అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్, అక్షరాభ్యస పూజలకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా భారీగా పోలీసుల బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.