తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Constable Donation: ఏఆర్‌ కానిస్టేబుల్ ఉదారత… రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్ విరాళం..

TS Constable Donation: ఏఆర్‌ కానిస్టేబుల్ ఉదారత… రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్ విరాళం..

HT Telugu Desk HT Telugu

25 February 2024, 6:00 IST

google News
    • TS Constable Donation: ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ కానిస్టేబుల్ ఒకరు తన పెన్షన్‌ విరాళంగా ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏఆర్‌ రిటైర్డ్ కానిస్టేబుల్ నెల పెన్షన్ ఖజానాకు విరాళంగా ఇచ్చారు. 
ప్రెస్‌ క్లబ్‌లో  ఏఆర్‌ కానిస్టేబుల్‌ను సన్మానిస్తున్న జర్నలిస్టులు
ప్రెస్‌ క్లబ్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ను సన్మానిస్తున్న జర్నలిస్టులు

ప్రెస్‌ క్లబ్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ను సన్మానిస్తున్న జర్నలిస్టులు

TS Constable Donation: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నందున తన నెల పెన్షన్‌ ప్రభుత్వ ఖజానాకు విరాళంగా ఇస్తున్నట్లు ఖమ్మంలో రిటైర్డ్‌ ఏఆర్ కానిస్టేబుల్ AR Constable ఒకరు ప్రకటించారు. సర్కారు ఇబ్బందుల్లో ఉందని తనకు వచ్చే ఒక నెల పెన్షన్ చేయూతగా ఇస్తున్నట్లు రిటైర్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వార్తలు రోజూ వింటున్న ఒక రిటైర్డ్ ఏఆర్ కానిస్టేబుల్ తనవంతు చేయూతను ప్రకటించాడు. ప్రభుత్వ అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడాన్ని తెలుసుకున్న ఆయన తనకు వచ్చే ఒక నెల పెన్షన్ ను ప్రభుత్వానికి ఇచ్చేశాడు.

ఖమ్మం Khammamనగరానికి చెందిన గులామ్ జాఫర్ Gulam Jafar ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేసేవాడు. కొన్ని అనివార్య కారణాలతో ఆయన తన ఉద్యోగానికి 1981వ సంవత్సరంలో రాజీనామా చేశారు.

స్వచ్చంద ఉద్యోగ విరమణ పొందిన జాఫర్ కు అప్పటి నుంచి ప్రతి నెలా రూ.21,000 పెన్షన్ గా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 78 సంవత్సరాలు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న విషయం తెలుసుకున్న జాఫర్ తనవంతు ఆర్థిక చేయూతను అందివ్వాలని నిర్ణయించుకున్నాడు.

సర్వీసులో ఉన్నంత కాలం ప్రభుత్వం తనకు వేతనం ఇచ్చిందని, స్వచ్చంద ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా తన జీవన భృతి సజావుగా సాగడానికి పెన్షన్ ఇస్తుందని తెలిపాడు.

అలాంటి ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో తనవంతు కర్తవ్యంగా ఆర్ధిక తోడ్పాటును అందించడం అవసరమని భావించి ఫిబ్రవరి నెల పెన్షన్ ను ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు తన సర్వీస్ నెంబర్ తో కూడిన వివరాలను పొందుపరుస్తూ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ కు లేఖ రాశారు. అనంతరం సంబంధిత వివరాలను తెలియజేస్తూ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.

జాఫర్ ప్రభుత్వం పట్ల విధేయత చూపుతూ, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.

(రిపోర్టింగ్ కాపర్తి నరేంద్ర, ఖమ్మం)

తదుపరి వ్యాసం