తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Margadarsi Chits: మార్గదర్శి వ్యవహారంలో ఎండీని ప్రశ్నిస్తున్న ఏపీ సిఐడి

Margadarsi chits: మార్గదర్శి వ్యవహారంలో ఎండీని ప్రశ్నిస్తున్న ఏపీ సిఐడి

HT Telugu Desk HT Telugu

06 June 2023, 12:49 IST

google News
    • Margadarsi chits: ఆర్ధిక లావాదేవీల్లో అక్రమాల నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ ఎండి చెరుకూరి శైలజను ఏపీ సిఐడి విచారిస్తోంది.  గత నెలలో ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసినా విదేశీ పర్యటనలో ఉండటంతో శైలజ విచారణకు హాజరు కాలేక పోయారు. 
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు (twitter)

మార్గదర్శి చిట్ ఫండ్ కేసు

Margadarsi chits: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహారంలో సంస్థ ఎండి శైలజను ఏపీ సిఐడి విచారిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థలో భారీ ఎత్తున ఆర్ధిక లావాదేవీలు జరిగాయని, వందల కోట్ల రుపాయల నగదు లావాదేవీలకు లెక్కలు చూపడం లేదని సిఐడి ఆరోపిస్తోంది.

ఈ క్రమంలో సిఐడి విచారణపై మార్గదర్శి సంస్థ తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ముందస్తు నోటీసుల నేపథ్యంలో ఎండీ శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. రామోజీ గ్రూప్‌ కంపెనీలకు ఫండ్స్‌ మళ్లించినట్టు సీఐడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు.

మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఏపీ సిఐడి గత నెలలో అటాచ్‌ చేసింది. మార్గదర్శికి సంబంధించిన రూ. 798.50 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్‌ చేసింది. మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీ, ఫోర్‌మెన్‌, ఆడిటర్లు కలిసి కుట్రకు పాల్పడినట్లు, చిట్స్‌ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. ఏపీలో 1989 చిట్స్‌ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది.

ప్రజల నుంచిసేకరించిన నగదు ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని గుర్తించిన సీఐడీ, చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా సంస్థ చిట్‌ఫండ్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపారు.

చందాదారుల నుంచి సేకరించిన నగదు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు గుర్తించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపుపై శైలజను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మార్గదర్శి సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ సిఐడిని తెలంగాణ హైకోర్టు ఆశ్రయించడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు జులైలో విచారణకు రానుంది.

తదుపరి వ్యాసం