తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara: మహాజాతరలో మరో ప్రధాన ఘట్టం.. నేడు మేడారంలో “మండమెలిగె పండుగ”.. మేడారంలో పెరుగుతున్న భక్తుల రద్దీ

Medaram Jatara: మహాజాతరలో మరో ప్రధాన ఘట్టం.. నేడు మేడారంలో “మండమెలిగె పండుగ”.. మేడారంలో పెరుగుతున్న భక్తుల రద్దీ

HT Telugu Desk HT Telugu

14 February 2024, 6:03 IST

google News
    • Medaram Jatara: వనదేవతల మహాజాతర.. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం దగ్గరపడుతోంది.
మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం (ఫైల్ ఫొటో)
మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం (ఫైల్ ఫొటో)

మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం (ఫైల్ ఫొటో)

Medaram Jatara: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి నేడు అంకురార్పణ జరుగనుంది. గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరగగా.. బుధవారం ఉదయం మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.

మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించే ఈ మండమెలిగే Mandamelige పండుగతో మేడారం జాతర ప్రారంభమైనట్టేనని భావిస్తుంటారు. మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.

మేడారం జాతరం కోసం తెలంగాణ Telangana Govt ప్రభుత్వం మొత్తం రూ.105 కోట్ల నిధులు మంజూరు చేయగా.. స్థానిక మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు ఆఫీసర్లకు టార్గెట్లు పెట్టి మరీ పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర ప్రముఖులకు మేడారం జాతర ఆహ్వాన పత్రికలు కూడా అందించారు.

మండమెలిగే పండుగతో పూజలు

మండమెలిగే Mandamelige పండుగ సందర్భంగా బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. మేడారంలో సమ్మక్క తల్లి, కన్నెపల్లిలో సారలమ్మ, పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజుల ఆలయాల్లో ఆదివాసీలు పూజలు నిర్వహిస్తారు.

పుట్టమట్టితో అలికి ముగ్గులు కూడా వేస్తారు. సమ్మక్క–సారలమ్మ Sammakka Saralamma ఆయుధాలు, గజ్జెలు, కత్తులు, కుంకుమ భరిణెలు, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేస్తారు. అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడి నుంచి సమ్మక్క గుడికి వెళ్లి గిరిజన ఆడపడుచులు పూజలు చేస్తారు. ఆ తరువాత గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు చేస్తారు.

చుట్టూ దిష్టి తోరణాలు.. రాత్రంతా దర్శనాలు బంద్

మండమెలిగే పండుగలో భాగంగానే మేడారం పొలిమేరల్లో పూజారులు దిష్టి తోరణాలు కడతారు. ఊరు చుట్టూ తోరణాలు కట్టడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు దరి చేరవని ఇక్కడి పూజారుల విశ్వాసం. దీంతోనే మేడారం పొలిమేరల్లో మామిడి, తునికి ఆకులతో తోరణాలు కడతారు.

ఊరు చుట్టూ చలిగంజి, అంబలితో కట్టు పోస్తారు. ఆ తరువాత సమ్మక్క, సారలమ్మకు సంబంధించిన పూజా సామగ్రిని మేడారం గద్దెలపైకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. పసుపు, కుంకుమలతో పూజలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరిస్తారు. పూజారులు అక్కడే చలపయ్య మొక్కులు సమర్పిస్తారు.

ఆ తరువాత పూజారులంతా అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి, పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం జాగారాలు కూడా చేపడుతారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు అమ్మవారి గద్దెల వద్దకు భక్తులు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు.

మండెమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్టేనని పూజారులు చెబుతుండగా.. ఈ పూజా తంతును తిలకించేందుకు కూడా భక్తులు తరలివస్తుంటారు.

జంపన్నవాగుకు నీటి విడుదల

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగు Jampanna Vagu లో పుణ్య స్నానాలు చేసేందుకు గోవిందరావు పేట Govindarao Pet మండలంలోని లక్నవరం సరస్సు Laknavaram Lake నుంచి సోమవారమే నీటిని విడుదల చేశారు.

లక్నవరం చెరువు తూముల నుంచి నీటిని విడుదల చేయగా.. అక్కడి నుంచి సద్దిమడుగు, దెయ్యాలవాగు నుంచి జంపన్నవాగుకు నీటిని తరలిస్తున్నారు. ఈపాటికే జంపన్నవాగుకు లక్నవరం చెరువు నీళ్లు చేరుకోగా.. భక్తులు పుణ్యస్నానాలకు అనువుగా అక్కడ అధికారులు స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు.

గట్టమ్మ వద్ద ఎదురుపిల్ల ఉత్సవం

మేడారం తొలి మొక్కులు అందుకునే ములుగు గట్టమ్మ తల్లి వద్ద మాఘశుద్ధ పంచమి నాడే ఎదురుపిల్ల ఉత్సవం జరుగుతుంది. గట్టమ్మ పూజారులైన నాయక పోడులు ఈ పండుగ జరపనుండగా. ఉదయం 10.30 గంటలకు పూజారులు బోనాలతో గట్టమ్మ ఆలయానికి చేరుకుంటారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయక పోడులు లక్ష్మీదేవరలతో నృత్యాలు చేసుకుంటూ గట్టమ్మ వద్దకు ర్యాలీగా చేరుకుంటారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కాగా పూజా క్రతువుతో ఎదురుపిల్ల ఉత్సవం పూర్తవుతుంది. ఇక్కడి నుంచి సరిగ్గా వారం రోజులకు మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ మహాజాతర కొనసాగనుంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం