August 28 Telugu News Updates: పార్టీ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
28 August 2022, 22:30 IST
- August 28 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..
పార్టీ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ జెండా మోసిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పెద్దపల్లిలో కేసీఆర్ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. జనసమీకరణ కోసం వీణవంకలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
నాతో రండి.. పనులు చూపిస్తా
పోరాటాల గడ్డ వరంగల్ వేదికగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా జూటా మాటలు మాట్లాడారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండిపడ్డారు. ఓరుగల్లులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. తనతో వస్తే పనుల తీరు చూపిస్తానని సవాల్ విసిరారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో తట్టెడు మట్టి తీయలేదని కేంద్రాన్ని విమర్శించారు.
వినాయక చవితి వేడుకలకు ఆటంకాలు సృష్టిస్తోంది
నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పండుగ జరుపుకోనేందుకు అనుమతులు తప్పనిసరి చేసి.. పండగ వాతావరణాన్ని ప్రభుత్వం నాశనం చేస్తుందన్నారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య
మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసే దేవేందర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వయసు 19 సంవత్సరాలు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో ఉన్న మంత్రి కార్యాలయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి.. మార్గంమధ్యలో దేవేందర్ చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.
వారికి టీడీపీ అండగా ఉంటుంది
వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అర్థరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రీలతో టీడీపీ కార్యకర్తల్ని వేదిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా తయారు చేస్తున్నామని చెప్పారు.
ఎనిమిదేళ్లలో ఏం ఇచ్చారు?
ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్ని మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 67 ఏళ్ల కాలంలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే తెలంగాణలో ఏర్పాటయ్యాయని చెప్పారు. వైద్య విద్యలో సీఎం కేసీఆర్ ఓ గొప్ప చరిత్ర లిఖించారని అన్నారు. అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు పేర్కొ్న్నారు. ట్వీట్టర్ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించారు.
సీఎస్ కు బండి సంజయ్ లేఖ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర సీఎస్ (CS)కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ బృందానికి అనుమతివ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
తొలి 3 ర్యాంకులు ఏపీ విద్యార్థులకే
ts icet results తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్వర్దన్ మొదటి ర్యాంకు సాధించగా, కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేశ్చంద్రరెడ్డి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయి మూడో ర్యాంకు సాధించారు.
కొనసాగుతున్న వరద
శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్ట్ 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు.
జంట హత్యలు…
నెల్లూరు నగరంలో దారుణం జరిగింది. మినీ బైపాస్ రోడ్డు ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద భార్యాభర్తలను దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరపడ్డ దుండగులు. భార్య వాసిరెడ్డి పద్మని గొంతు కోసి హత్య చేశారు.
కొత్త కేసులు ఎన్నంటే
భారత్‌లో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో ముగ్గురు అరెస్ట్
బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్య కేసుకు సంబంధించి మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు
పరీక్ష ప్రారంభం
తెలంగాణలో కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.మొత్తం 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రం ఉంటుంది.
కొనసాగనున్న భేటీ
ఇవాళ కూడా రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగునుంది. వ్యవసాయంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.
సెప్టెంబర్ 12 నుంచి యాత్ర
సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు కానున్నట్లు ప్రకటించారు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 80,312 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రధాని మోదీ మన్ కీ బాత్
ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడనున్నారు.
నేడు రేపు వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావతంతో ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
పాక్ వర్సెస్ భారత్ మ్యాచ్
IND vs PAK Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు 15వ సారి తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తమ తొలి మ్యా్చ్‌లో పోరాడనున్నాయి.
భారీ అగ్నిప్రమాదం
నిజామాబాద్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్యనగర్‌లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా స్టోర్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.