తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Apgvb Bifurcation: తెలంగాణలో కనుమరుగు కానున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్ బ్యాంక్.. జనవరి 1న తెలంగాణలో కొత్త బ్యాంక్‌

APGVB Bifurcation: తెలంగాణలో కనుమరుగు కానున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్ బ్యాంక్.. జనవరి 1న తెలంగాణలో కొత్త బ్యాంక్‌

20 December 2024, 12:33 IST

google News
    • APGVB Bifurcation: వరంగల్‌ కేంద్రంగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీజీవీబీని విభజించాలని నిర్ణయించారు. డిపార్ట్‌‌మెంట్‌ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ఉత్తర్వులకు అనుగుణంగా బ్యాంకు విభజన జరుగుతోంది.
తెలంగాణలో జనవరి 1నుంచి కనుమరుగు కానున్న ఏపీజీవీబీ
తెలంగాణలో జనవరి 1నుంచి కనుమరుగు కానున్న ఏపీజీవీబీ

తెలంగాణలో జనవరి 1నుంచి కనుమరుగు కానున్న ఏపీజీవీబీ

APGVB Bifurcation: తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్ బ్యాంక్‌ ఇకపై ఏపీకి మాత్రమే పరిమితం కానుంది. కేంద్ర ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉత్తర్వుల ప్రకారం బ్యాంకు కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాల మధ్య విభజించనున్ారు. ఈ మేరకు నవంబర్ 13న డిఎఫ్ఎస్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా రిజర్వ్‌బ్యాంకు అమోదంతో 2006లొ పార్లమెంటు చట్టం ప్రకారం స్థాపించబడింది. ఇందులో మంజీర గ్రామీణ బ్యాంక్ (మెదక్), సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ (మహబూబ్‌నగర్), కాకతీయ గ్రామీణ బ్యాంక్ (వరంగల్), నాగార్జున గ్రామీణ బ్యాంక్ (ఖమ్మం & నల్గొండ), శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ (విశాఖపట్నం, విజయనగరం & శ్రీకాకుళం) విలీనం అయ్యాయి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీజీవీబీ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. తెలంగాణలోని హన్మకొండ, వరంగల్‌‌లో ఏపీజీవీబీ ప్రధాన కార్యాలయంతో తెలంగాణా రాష్ట్రంలోని 21 జిల్లాలు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తోంది.

ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌..

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏపీజీవీబీని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య విభజించనున్నారు. ఈ విభజనతో తెలంగాణ రాష్ట్రానపికి 493 బ్రాంచిలతో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పాటయ్యే టీజీబీకు హైదరాబాద్‌ హెడ్ క్వార్టర్ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 278 బ్రాంచీలతో ఏపీజీవీబీ యథాతథంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీజీవీబీ కార్యకలాపాలకు డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకు అంతరాయం కలుగనుంది. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం కలుగుతుందని ప్రకటించారు.

ఈ సమయంలో యూపీఐ పేమెంట్లు, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ కూడా అందుబాటులో ఉండదు. బ్యాంకు వినియోగదారులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. కొత్త బ్యాంకింగ్ సేవలు పాత బ్రాంచీలలో యథాతథంగా కొనసాగుతాయి. అకౌంట్ నంబర్లు పాతవే కొనసాగుతాయి.

యూపీఐ సేవలకు అంతరాయం.

తెలంగాణలో ఉండే ఏపీజీవీబీ బ్యాంకు కస్టమర్లు తమ యూపీఐ అకౌంట్లను డి రిజిస్టర్‌ చేసి తిరిగి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఏపీజీవీబీ అకౌంట్‌ను యూపీఐలో తొలగించి తిరిగి తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌(TGB)ను రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణలో యూపీఐ చెల్లింపుల కోసం ఆధార్‌ కార్డుతో లింక్ అయినా మొబైల్ నంబర్‌‌తో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. డెబిట్‌ కార్డుతో కూడా యూపీఐ రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయి.

ఆంధ్రా ప్రాంతంలో బ్యాంకింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం నాలుగు రోజుల పాటు సేవల్లో అంతరాయం కలుగుతుందని ఏపీజీవీబీ ప్రకటించింది. పూర్తి వివరాలకు https://apgvb.in/ ను చూడండి.

2 తెలుగు రాష్ట్రాలలో 771 శాఖలు, 2804 బ్యాంక్ మిత్ర పాయింట్లతో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు సేవలందిస్తున్న ప్రముఖ బ్యాంకులలో ఒకటిగా నిలిచిందివ. బ్యాంకుకు ఉన్న మొత్తం శాఖలలో 500 శాఖలు దాదాపు 64% గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.

ఏపీజీవీబీ తెలంగాణలో భద్రాచలం, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఏపీలో అనకాపల్లి, పార్వతీపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలలో కార్యకలాపాలు సాగుతున్నాయి.

తదుపరి వ్యాసం