08 March Telugu News Updates | ఢిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
08 March 2023, 21:54 IST
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. ఇదే కేసులో అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవితకు పిళ్లై బినామీ అని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈడీకి కవిత లేఖ రాశారు. లేఖలో భాగంగా రేపు(గురువారం) ఈడీ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. కాగా ఈనెల 15వ లేదీన హాజరు అవుతానని లేఖలో చెప్పారు. అయితే ఈడీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బుధవారం సాయంత్రం కవిత ఢిల్లీకి బయల్దేదారు.
కీలక భేటీ
ఎల్లుండి ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక భేటీ జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశానికి రావాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేతలను ఆదేశించారు.
తేదీలు విడుదల
మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు అధికారులు. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగియనుంది. మే 5వ తేదీన ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 24, 25న ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు గడువు ఉంటుంది.
మరో అరెస్ట్…
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో మరో అరెస్టు జరిగింది. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను సీఐడి అదుపులోకి తీసుకుంది.
ఫైర్
కేసీఆర్ బిడ్డ దొంగ దందాలతో ప్రజలకేం సంబంధమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కవిత దొంగ దందా సొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తలవంచని తెలంగాణ... కేసీఆర్ బిడ్డ దొంగ దందాతో దేశం ముందు తలదించుకునే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు. దొంగ, లంగ దందాలు చేసేవాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందని కామెంట్స్ చేశారు. బుధవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విషాదం
హోలీ... దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండగ. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా... ప్రతిచోట కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు. అందరూ రోడ్లమీదకొచ్చి.. రంగులు పూసుకుంటూ ఆనందంగా గడుపుతుంటారు. ఇక పలుచోట్ల డీజేలు పెట్టుకొని మరీ... తెగ ఎంజాయ్ చేసేస్తారు. అయితే పండగలో విషాదం జరిగింది. రంగు పోశాడన్న కారణంతో ఏకంగా పెట్రోల్ పోసి మరీ నిప్పుటించాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‌లో భాగంగా 30 జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా నోటిఫికేషన్ లో ఇచ్చిన 30 ఉద్యోగాల్లో 24 పోస్టులను ప్రత్యక్షంగా రిక్రూట్ చేస్తుండగా.. మరో ఆరు పోస్టులను రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. హైకోర్టు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బండి సంజయ్ కామెంట్స్
కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులకు, తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు బండి సంజయ్. విచారణకు పిలిస్తే వెళ్లి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
జియో
Jio 5g Services in Telangana: రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణలో వేగంగా విస్తరించే పనిలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 నగరాల్లో ప్రారంభించగా...తాజాగా మరో 8 పట్టణాల్లో కూడా సేవలను షురూ చేసింది. కొత్తగా జియో 5జీ సేవలు... సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్ నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ 8 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవలను పొందుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సిమ్లా టూర్
సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. HAPPY HIMACHAL పేరుతో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో భాగంగా ఛండీఘర్, మనాలి. సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు మరిన్ని కవర్ అవుతాయి.
ఇది 7 రోజులు, 6 రాత్రుల ప్యాకేజీ. ప్రస్తుతం ఈ ట్రిప్ ఏప్రిల్ 18వ తేదీన అందుబాటులో ఉంది.
రేపు హాజరు కాలేను
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు అందాయి. ఈ క్రమంలో ఈడీకి కవిత లేఖ రాశారు. లేఖలో భాగంగా రేపు(గురువారం) ఈడీ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. కాగా ఈనెల 15వ లేదీన హాజరు అవుతానని లేఖలో వెల్లడించారు.
కీలక ప్రకటన
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏపీలో వేగంగా జరుగుతున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ఇంధన శాఖ. మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలు పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పలు వివరాలను వెల్లడించారు.
పోస్టుల భర్తీ…
Kendriya Vidyalaya Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ శివరాంపల్లిలోని కేంద్రీయ విద్యాలయం. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీచింగ్ తో పాటు మరికొన్ని నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈడీ/ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే... ఇంటర్వూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ కేటగిరిలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
టాంక్ బండ్‌పై షర్మిల దీక్ష భగ్నం
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదంటూ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ట్యాంక్ బండ్ రాణి రుద్రమ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టిన షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం తరలించారు.
పత్తిపాడు ఇంఛార్జిగా వరుపుల రాజా సతీమణి
వరుపుల రాజా మృతి తో రాజా స్థానాన్ని, ఆయన సతీమణి సత్యప్రభ భర్తీ చేస్తారని టీడీపీ కాకినాడపార్లమెంట్ఇంచార్జ్ జ్యోతుల నవీన్ తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారని జ్యోతుల నవీన్ ప్రకటించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా వరుపుల రాజా కుటుంబానికి అండగా ఉంటామని జ్యోతుల నవీన్ ప్రకటించారు.
ఈడీ నోటీసులపై స్పందించిన కవిత
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రేపు ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చిందని, చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తా అని ప్రకటించారు. విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటానన్నారు. ప్రజా వ్యతిరేకత, అణచివేత చర్యలకు తెలంగాణ ఎప్పుడూ తలవంచదని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో ప్రకటించారు.
అమ్మకానికి CRDA భూములు
సిఆర్‌డిఏ భూముల్ని విక్రయించేందుకు సిద్ధమవుతోంది. గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో భూముల ధర నిర్ణయించేందుకు కమిటీ భేటీ కానుంది. మంగళగిరి మండలం నవులూరులో 10 ఎకరాలు అమ్మాలని నిర్ణయించారు. ఒక్కో ఎకరం ధర రూ.5.90 కోట్ల అప్‍సెట్ ధర నిర్ణయించారు. తుళ్లూరు మండలం పిచ్చుకుల పాలెంలో మరో నాలుగు ఎకరాలు అమ్మాలని నిర్ణయించారు. ఎకరం రూ.5.40 కోట్లకు అప్ సెట్ ధర నిర్ణయించారు. గతంలో నవులూరు భూముల విక్రయానికి సిద్ధమైన ప్రభుత్వం, చివరి నిమిషంలో వేలం ఆగిపోయింది. రాజధాని భూములు ఇతర అవసరాలకు విక్రయించవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు వెలువరించిన నేపథ్యంలో మరోమారు సిఆర్‌డిఏ సన్నాహాలు చేస్తోంది.
మహిళా దినోత్సం సందర్భంగా సిబిఎన్ కనెక్ట్
మహిళా దినోత్సవం సందర్భంగా CBN కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాల మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్చువల్ విధానంలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహిళా సాధికారత, ప్రభుత్వ విధానాలు వంటి అంశాలపై వివిధ వర్గాల మహిళలతో ఆన్‍లైన్‍లో చర్చించనున్నారు.
భార్యను కాల్చి చంపిన భర్త
అల్లూరి జిల్లా మొండిగడ్డ గాలిమాను వీధిలో దారుణం జరిగింది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఈనెల 2న నాటు తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. నిందితుడు రామచంద్రరావును అరెస్ట్ చేసి రిమాండ్‍కు తరలించారు.
నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత నేడు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో కవితను అరెస్ట్ చేస్తారని బీఆర్‍ఎస్‍లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే.. ఢిల్లీ, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.