December 21 Telugu News Updates : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు మంత్రి కేటీఆర్
21 December 2022, 21:55 IST
- ఏపీ, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి..
సీబీఐ తనిఖీలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. బృందావన్ అపార్ట్‌మెంట్‌లోని చవ్వా గోపాల్‌రెడ్డి కార్యాలయంలో 3 గంటల పాటు తనిఖీలు చేపట్టారు. ఐదుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం ప్రత్యేక వాహనంలో తాడిపత్రికి వచ్చింది. చవ్వా కార్యాలయంలో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. చవ్వా గోపాల్ రెడ్డి... మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.
డీఎల్ సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే ఏపీని కాపాడుతారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఏపీని కాపాడాలని ఆకాంక్షించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. గత ఎన్నికలకు ముందు తన ఇంటికి ప్రత్యేక దూతల్ని పంపించి మరీ పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పటికీ తాను వైసీపీలోనే ఉన్నానని ప్రకటించారు. వైసీపీ వాళ్లేమీ తనను తీసేయలేదని... వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని వ్యాఖ్యానించారు.ఇలాంటి పార్టీలో తాను ఉన్నానంటే అసహ్యంగా ఉందన్నారు.
నానో హెలికాప్టర్ కారు..
ఓ కార్పెంటర్ తన అద్భుతమైన కళానైపుణ్యంతో నానో కారును ఏకంగా హెలికాప్టర్‌గా మార్చేశాడు. ఈ హెలికాప్టర్ రోడ్డుపై నడిచేదే అయినా.. కారులో ప్రయాణిస్తున్న వారికి విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అజంగఢ్‌కు చెందిన సల్మాన్ కార్పెంటర్ పని చేస్తుంటాడు తనకున్న నైపుణ్యంతో తన వద్ద ఉన్న నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు. తయారు చేసేందుకు నాలుగు నెలల సమయం తీసుకున్నాడు. దీని ధర రూ. 3 లక్షలుగా ఉంటుందని సల్మాన్ చెప్పాడు. ప్రస్తుతం దీనికి మంచి డిమాండ్ ఉందని అన్నాడు. ప్రభుత్వం కానీ ఇతర కంపెనీలు ఏవైనా తనకి సాయం అందిస్తే... మరిన్ని అద్భుతాలను సృష్టిస్తానని చెప్పుకొస్తున్నాడు. నీరు, గాలితో నడిచే హెలికాప్టర్లను సైతం తయారుచేయగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటన
కొవిడ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ స్పష్టం చేశారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్ నెల నుంచి దాదాపు 30 వేల శ్యాంపిళ్లను టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదని వెల్లడించారు. జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశామని... రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచామని... ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.
కీలక కామెంట్స్
రుషికొండలో తవ్వకాలపై దాఖలనై పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పనులను పరిశీలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై అసహనం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కమిటీపై ఉన్న అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్లను కోర్టు ఆదేశించింది.
జగన్ కు చంద్రబాబు విషెస్…
మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని నరేంద్రమోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే గతేడాది కూడా సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్... మాత్రం స్పందించలేదు. గతేడాది కూడా ఆయన విష్ చేయలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు.
డిజిటల్ విప్లవం
CM YS Jagan Speech in Yadlapalli Public Meeting: బతుకులు మారాలంటే.. తలరాతలు మారాలి. తలరాతలు మారాలంటే.. చదువు అనే ఒకే ఒక్క ఆస్తి ద్వారానే మారుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. బాపట్ల జిల్లా యడ్లపల్లిలో నిర్వహించిన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్... తన పుట్టిన రోజున ఎంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలుపంచుకోవడం దేవుడుచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మన రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వైసీపీ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ప్రతి బడిలోనూ ఒక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
బుక్ ఫెయిర్
Hyderabad Book Fair 2022: హైదరాబాద్ బుక్ ఫెయిర్ వచ్చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల జాతరకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభమయ్యే ఈ బుక్ ఫెయిర్... జనవరి 1వ తేదీ వరకు ఉంటుంది.
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఇంట విషాదం
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు చంద్రమౌళి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. మూడు రోజులు మృత్యువుతో పోరాడి.. చనిపోయారు చంద్రమౌళి.
100 పాఠశాలలు ప్రారంభం
డీఏపీ ఎరువు ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలిచ్చారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు పెంచేలా కృషి చేయాలన్నారు. జనవరి రెండో తేదీన 100 పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు హరీశ్ చెప్పారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు మంత్రి కేటీఆర్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వచ్చేనెల 16 నుంచి 20 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023 వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. నిర్వాహకుల ఆహ్వనం మేరకు ఈ సదస్సుకు కేటీఆర్ హజరవుతున్నారు.