తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Canara Bank Employee Suicide: భర్తతో కలిసి ఉండాలని వెళ్లి, విజయవాడ యువతి ఆత్మహత్య

Canara Bank Employee Suicide: భర్తతో కలిసి ఉండాలని వెళ్లి, విజయవాడ యువతి ఆత్మహత్య

Sarath chandra.B HT Telugu

19 October 2023, 6:38 IST

google News
    • Canara Bank Employee Suicide: భర్త వేధింపులు, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, పనిచేస్తున్న సంస్థలో సమస్యలతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. భర్తతో కలిసి ఉండేందుకు సెలవుపై హైదరాబాద్‌ వెళ్లిన యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకుని వృద్ధులైన తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పెళ్లైన ఏడాదిన్నరకే యువతి ఆత్మహత్య
పెళ్లైన ఏడాదిన్నరకే యువతి ఆత్మహత్య

పెళ్లైన ఏడాదిన్నరకే యువతి ఆత్మహత్య

Canara Bank Employee Suicide: భర్త తీరుతో విసిగిపోయిన యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన హైదరాబాద్‌ జవహార్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బండారు సౌజన్య,నగరంలోని మధునగర్‌ కెనరా బ్యాంకు బ్రాంచిలో పనిచేస్తోంది.ఈ మెకు 2021 నవంబర్‌లో నెల్లూరు జిల్లా ఉలవపాడుకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

వెంకటే‌శ్వర్లు సికింద్రబాబాద్‌ ప్రాంతంలో జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌ శైలి గార్డెన్‌లోని ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నారు. సౌజన్య తల్లి దండ్రులతో కలిసి విజయవాడలో నివసిస్తున్నారు. పెళ్లైన తర్వాత వారాంతాల్లో భర్త వద్దకు వెళ్లి వచ్చేది. పెళ్లైన తర్వాత రెండేళ్లుగా భార్యభర్తలు చెరో చోట పనిచేస్తున్నారు.

వివాహం జరిగే సమయానికి కర్ణాటకలోని విజయపురాలో పనిచేస్తున్న సౌజన్య హైదరాబాద్‌ బదిలీ కోరుకున్నారు. బ్యాంకు యాజమాన్యం విజయవాడకు బదిలీ చేసింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ బదిలీ కోసం ప్రయత్నిస్తోన్న సౌజన్య విజ్ఞప్తిని బ్యాంకు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో నిరాశకు గురయ్యేది.

స్పౌజ్ గ్రౌండ్‌‌లో తాను భర్తతో కలిసి ఉండేందుకు అనుమతించాలని కోరుతున్నా ఇటీవలి బదిలీల్లో ఆమెకు ట్రాన్స్‌ఫర్‌ రాలేదు. దీంతో నవంబర్‌11న లాస్‌ ఆఫ్‌ పే మీద సెలవుపై భర్త వద్దకు వెళ్లింది. భర్తతో కలిసి ఉండేందుకు వెళ్లిన నెల రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది.

పెళ్లైన తర్వాత భర్త దూరంగా ఉండటంతో మానసికంగా కుంగి పోయింది. దీనికి తోడు భర్త క్రెడిట్‌ కార్డులతో లక్షల రుపాయలు అప్పులు చేసి వాటిని తీర్చాల్సిందిగా ఆమెపై ఒత్తిడి చేసేవాడు. ప్రతి నెల క్రెడిట్‌ కార్డుల బిల్లులు ఆమె జీతం నుంచి చెల్లించాల్సి వచ్చేదని స్నేహితులకు చెప్పుకుని బాధపడేది. వైవాహిక జీవితం సంతోషాన్ని మిగల్చక పోవడంతో విడాకులు తీసుకోవాలని భావించినా వృద్ధులైన తల్లిదండ్రుల్ని బాధపట్టడం ఇష్టం లేక సర్దుకు పోయింది.

భర్త ప్రవర్తన, అలవాట్ల గురించి ఆడపడుచులకు చెప్పినా ఆమెను వారు నిందించే వారు. సంసార జీవితం సంతోషాన్ని మిగల్చకపోవడం,భర్తతో సఖ్యత లేకపోవడం, పిల్లలు లేకపోవడం వంటి కారణాలతో తరచూ మనస్తాపానికి గురయ్యేదని బంధువులు తెలిపారు.

కొద్ది నెలల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్‌‌‌ బదిలీపై వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలించకపోవడంతో గత నెలరోజులుగా సెలవుపై వెళ్లి యాప్రాల్‌లో భర్తతో కలిసి ఉంటోంది. భర్త దగ్గరకు వెళ్లిన తర్వాత అతని అలవాట్ల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సౌజన్య హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత కూడా భర్త ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి రాకపోవడం, నిత్యంమద్యం సేవించి వస్తుండటంపై ఆమె అభ్యంతరం తెలిపేది.

ఇంట్లో రోజంతా ఒంటరిగా ఉండాల్సి రావడంతో ఇబ్బంది పడేది. మంగళవారం రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అర్థరాత్రి దాటాక తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఊరేసుకుంది. ఆ తర్వాత చాలా సేపటికి గమనించిన వెంకటేశ్వర్లు వాచ్‌మాన్ సాయంతో కిందకు దింపి అప్పటికే చనిపోయిందని గుర్తించాడు. మృతురాలు రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం ఉదయం పనిమనిషి వచ్చే వరకు మృతదేహం వద్దే వెంకటేశ్వర్లు కూర్చుండిపోయాడు. పనిమనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్త వద్దకు వెళ్లకుండా తమ వద్దే ఉన్నా కుమార్తె ప్రాణాలతో ఉండేదని తల్లిదండ్రులు వాపోయారు.

ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదనే లక్ష్యంతో కష్టపడి 2017లో బ్యాంకు ఉద్యోగం సాధించిందనని తెలిపారు. తమ వద్ద ఉన్నా కుమార్తె ప్రాణాలతో ఉండేదని మృతురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సౌజన్య చావుకు భర్తే కారణమని అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

తదుపరి వ్యాసం