తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kazipet Attack: కాజీపేటలో వృద్ధుడిపై కత్తితో దాడి.. వరుస ఘటనలతో వరంగల్ ట్రై సిటీలో కలకలం

Kazipet Attack: కాజీపేటలో వృద్ధుడిపై కత్తితో దాడి.. వరుస ఘటనలతో వరంగల్ ట్రై సిటీలో కలకలం

HT Telugu Desk HT Telugu

04 December 2024, 6:38 IST

google News
    • Kazipet Attack: వరంగల్ నగరంలో మరో దారుణం జరిగింది. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వెలిగేటి రాజామోహన్ హత్య జరిగిన రోజే.. మరో వృద్ధుడిపై హత్యా ప్రయత్నం జరిగింది. దాదాపు 70 ఏళ్లున్న వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో తీవ్రంగా దాడి చేయగా.. అడ్డుకోబోయిన అతడి కొడుకుపై కూడా దాడి చేశాడు. 
వరంగల్‌ ట్రై సిటీలో వృద్ధుడిపై హత్యాయత్నం
వరంగల్‌ ట్రై సిటీలో వృద్ధుడిపై హత్యాయత్నం

వరంగల్‌ ట్రై సిటీలో వృద్ధుడిపై హత్యాయత్నం

Kazipet Attack: వరంగల్‌లో 70ఏళ్ల వృద్ధుడిపై హత్యాయత్నం కలకలం రేపింది. కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన కుమారుడిపై కూడా నిందితుడు హత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడున్న వాళ్లు గమనించి వృద్ధుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ ట్రై సిటీలోని కాజీపేట బాపూజీ నగర్ కు చెందిన అలువాల మాల కొండయ్య అనే 70 ఏళ్ల వృద్ధుడు స్థానిక పెట్రోల్ బంక్ వెనకాల కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పక్కనే మెయిన్ రోడ్డుపై కొంతకాలంగా సిమెంట్ అండ్ హార్డ్ వేర్ షాప్ నడిపిస్తున్నాడు.

కత్తి, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి..

రోజువారీగా షాప్ కు వెళ్లిన మాల కొండయ్య మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో షాప్ మూసి అక్కడి నుంచి ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో బాపూజీ నగర్ లోని తన ఇంటి సమీపంలోకి చేరుకోగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో వృద్ధుడు మాల కొండయ్యపై వెనుక నుంచి దాడికి దిగాడు. కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించగా.. మాల కొండయ్య ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న కర్రతో గుర్తు తెలియని దుండగుడిని ఎదిరించే ప్రయత్నం చేయగా.. పలుమార్లు కత్తితో దాడి చేయడంతో వృద్ధుడు కింద పడిపోయాడు.

అయినా దుండగుడు వదలకుండా కత్తితో దాడి చేయడంతో వృద్ధుడు అక్కడ కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన చనిపోయాడని భావించిన ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దూరం నుంచి గమనించి మాల కొండయ్య చిన్న కొడుకు పరుగున అక్కడికి చేరుకున్నాడు. పారిపోతున్న యువకుడిని పట్టుకునేందుకు పరుగులు తీశాడు. దీంతో ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ప్యాకెట్లను మాల కొండయ్య చిన్న కొడుకుపై విసిరి అక్కడి నుంచి ఉడాయించాడు. ఒకవేళ పెట్రోల్ ప్యాకెట్ పగిలితే దానికి నిప్పంటించే ప్రయత్నం చేసే వాడని స్థానికులు భావిస్తున్నారు.

కాగా కుప్పకూలి పడిపోయిన మాల కొండయ్యను అతని చిన్న కొడుకు స్థానికుల సహాయంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్త స్రావం జరగడంతో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ఆర్థిక వ్యవహారాలా.. పాత కక్షలా..?

70 ఏళ్ల వృద్ధుడిపై దాడి ఘటన కాజీపేటలో తీవ్ర కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న కాజీపేట సీఐ వై.సుధాకర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. 70 ఏళ్ల మాల కొండయ్యపై యువకుడు దాడికి పాల్పడటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అర్థిక వ్యవహారాలా.. లేక పాత కక్షల నేపథ్యంలో దాడికి పాల్పడి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ సుధాకర్ రెడ్డి వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం