Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్, లేబర్ పార్టీ తరపున పోటీ
17 May 2024, 6:58 IST
- Hyderabadi In UK Polls: యూకేలో జరుగుతోన్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ఏఐ శాస్త్రవేత్త ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.
యూకే ఎన్నికల్లో పాల్గొంటున్న సిద్ధిపేటకు చెందిన ఉదయ్ నాగరాజు
Hyderabadi In UK Polls: యూకే సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వారిలో ఉదయ్ నాగరాజు ఒకరు. యూకే పార్లమెంటు ఎన్నికల బరిలో తెలంగాణకు చెందిన ప్రవాస ఐటీ ప్రొఫెషనల్ తలపడుతుండటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. యూకే సాధారణ ఎన్నికల్లో నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పోటీ ఉదయ్ నాగరాజు చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో అధికంగా నివసించే ప్రవాస ఓటర్లను పార్లమెంటులో వారి తరపున పనిచేసే తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
మెరుగైన అవకాశాలు, ఉపాధి కోసం యూకే వెళ్లిన ఉదయ్ నాగరాజు తన వృత్తికి పరిమితం కాలేదు. ఎల్లలు దాటి వెళ్లినా తనలో ఉన్న ఆసక్తిని చంపుకోలేదు. వృత్తి రీత్యా ఆర్టిఫిషియల్ ఇంజనీర్ అయినా రాజకీయాల్లో ఉన్న ఆసక్తితో ఆ వైపు అడుగులు వేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడైన ఉదయ్ నాగరాజు చాలా కాలం క్రితం యూకే వెళ్లి స్థిరపడిన తెలుగు వారిలో ఒకరు. కెరీర్‌ను నిర్మించుకునే క్రమంలో ఎంతో శ్రమించి ఓ స్థాయికి ఎదిగారు. నిత్య జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై లోతైన పరిశోధనలు చేశారు. ఆయన ఆసక్తి శాస్త్ర సాంకేతిక రంగాలకు మాత్రమే పరిమితం కాలేదు. యూకేలో స్థిరపడిన తెలుగువారిలో రాజకీయాల్లో కూడా ప్రభావం చూపిస్తోన్న అతికొద్ది మందిలో ఆయన ఒకరు. ప్రవాసులు ఎక్కువగా నివసించే నార్త్‌బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
యూకే సాధారణ ఎన్నికల్లో నార్త్ బెడ్‌ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ప్రవాస తెలుగు ప్రజలు అధికంగా నివసించే నార్త్ బెడ్‌షోర్ వంటి ప్రాంతంలో లేబర్ పార్టీ మాత్రమే స్థానిక అవసరాలను నెరవేర్చగలదని ఆయన ప్రచారం చేస్తున్నారు. కష్టజీవులైన ప్రజల గళాన్ని తాను వినిపిస్తానని నాగరాజు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా శనిగారం గ్రామానికి చెందిన ఉదయ్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆయన సోదరి, తల్లి హైదరాబాద్‌లో ఉంటున్నారు. నాగరాజు సొంత కష్టంతో ఈ స్థాయికి ఎదిగారు. నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ ప్రాంతంలో కన్జర్వేటివ్ పార్టీ ఆధిపత్యం ఉండేది. గత కొన్నేళ్లుగా దక్షిణాసియా ప్రాంతాల నుంచి ఇక్కడకు భారీగా వలసలు పెరగడంతో నాగారాజుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది.
ఈ ప్రాంతంలో అతిపెద్ద నగరంగా ఉన్న లుటన్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన వారి జనాభా 2011 -2021 మధ్య కాలంలో 51శాతం పెరిగింది. పాకిస్తాన్ జాతీయత కలిగిన వారి జనాభా 40శాతం పెరిగింది. భారతీయుల జనాభా కూడా గణనీయంగానే ఉంది. యూకే ఎన్నికల్లో ప్రవాస భారతీయులు ఎక్కువగా లేబర్ పార్టీవైపు మొగ్గు చూపుతుంటారు. ఇటీవలి కాలంలో వారు కన్జర్వేటివ్ పార్టీవైపు కూడా మొగ్గుతున్నట్టు గణంకాలు సూచిస్తున్నాయి.
మరోవైపు యూకే ఎన్నికల్లో పాల్గొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.
లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవం అని నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు అవసరమైన మార్పును లేబర్ ప్రభుత్వం మాత్రమే అందించగలదని నాగరాజు పేర్కొన్నారు.
కష్టపడి పనిచేసే ఈ సమాజంలోని ప్రజల కోసం తన గళం ఇస్తానని చెప్పారు. స్థానికంగా మరిన్ని అవకాశాలు తీసుకురావడానికి పోరాడతానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.