Rythu Bandhu Funds : ఆ తేదీలోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు…! 'రైతుబంధు' నిధుల జమపై కీలక ప్రకటన
07 January 2024, 6:54 IST
- Rythu Bandhu Funds Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నిధుల జమ ప్రక్రియపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్షించగా… రైతులకు త్వరితగతిన పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
రైతుబంధు స్కీమ్ నిధులు
Rythu Bandhu Funds : రైతుబంధు నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ… జమ ప్రక్రియ నత్తనకడన సాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్నవారికి మాత్రం డబ్బులు అందినట్లు తెలిసింది. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో నిధుల జమకు సంబంధించి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు ఇచ్చారు.
శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధుల జమ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు త్వరితగతిన వారి ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేయాలని ఆదేశించారు. నిధుల జమ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం నుంచి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి సంక్రమించినా… సకాలంలో నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. పంట పెట్టుబడి స్కీమ్ కు సంబంధించి రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. ఇప్పటి వరకు దాదాపు 42 శాతం అంటే 27 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల అయ్యాయని చెప్పారు.
సోమవారం నుంచి ఎక్కువ మంది రైతులకు రైతుబంధు సాయం చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. జనవరి నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. సంక్రాంతి తర్వాత మరోసారి సమీక్ష జరుపుతామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు.
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… రైతుభరోసాకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతుబంధు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని… కొత్త రైతులు మాత్రమే చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ కూడా ఇచ్చారు. జనవరి 6వ తేదీతో ప్రజా పాలన కార్యక్రమ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. వచ్చిన అప్లికేషన్లను అన్నింటిని ఆన్ లైన్ లో నిక్షిప్తం చేసే పనిలో ఉంది ప్రభుత్వం. జనవరి 17వ తేదీ లోపు డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది.