Adulterated liquor: ఖరీదైన బాటిళ్లలో కల్తీ మద్యం, హైదరాబాద్‌లో బార్ బాయ్స్ అరాచకం, ధర తక్కువ అంటూ విక్రయాలు
24 September 2024, 8:54 IST
- Adulterated liquor: హైదరాబాద్‌లో కొత్త రకం దందా వెలుగు చూసింది. బార్‌లలో ఖాళీ చేసే ఖరీదైన మద్యం సీసాలను సేకరించి వాటిలో చౌక రకం మద్యాన్ని నింపి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరకే విక్రయం పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఖాళీ బాటిళ్లతో కల్తీ మద్యం విక్రయాలు
Adulterated liquor: కారు చౌకగా ఖరీదైన మద్యం అంటూ జనాన్ని బురిడీ కొటిస్తున్న ముఠా బండారం బయటపడింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం పేరుతో నాసిరక మద్యాన్ని అంటగడుతున్న వైనం వెలుగు చూసింది. బార్ అండ్ రెస్టారెంట్లలో పనిచేసే బార్ బాయ్స్ అక్కడ తాగేసిన మద్యం బాటిళ్లను సేకరించి తమ దందాకు వాడుకుంటున్నారు.
ఖరీదైన స్కాచ్, విదేశీ మద్యం తక్కువ ధరకే విక్రయిస్తున్నామని మాయ మాటలు చెప్పి వేల రుపాయలు గుంజుతున్న ముఠా హైదరాబాద్ పోలీసులకు పట్టుబడింది. దిల్లీ, హరియాణా, గోవాల నుంచి తీసుకొచ్చామని నమ్మించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే విక్రయిస్తామని బోల్తా కొట్టిస్తున్నారు.
జనాన్ని నమ్మించి మోసం చేస్తున్న ముఠాను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇటీవల జూబ్లిహిల్స్ వద్ద 30 మద్యం సీసాలను ఒక ఆటోలో తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న కలకంద అనిల్ కుమార్‌ను పట్టుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది.
ఆకుల అజయ్ కుమార్ సూచనలతో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని షబానా రెసిడెస్సీ నుంచి తీసుకు వస్తున్నట్లు నిందితుడు వివరించాడు. దీంతో ఎక్బై జ్ పోలీసులు షబానా రెసిడెన్సీపై దాడి చేశారు. తనిఖీల సమయంలో 10 మద్యం సీసాలు, 189 ఖాళీ మద్యం బాటిళ్లు, మద్యం సీసాలకు బిగించే 100 మూతలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా బార్‌ల నుంచి ఖాళీ బాటిళ్లు సేకరించి వాటిలో నాసిరకం మద్యాన్ని మిక్స్ చేసి నింపుతున్నట్టు గుర్తించారు.
ఒడిశాకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగ న్నాథ్ సాహుల సాయంతో బాటిళ్లను సేకరిస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. పట్టుబడిన వారంతా నగరంలోని పలు బార్లలో పని చేస్తున్నారు. బార్లలో తాగేసిన ఖాళీ సీసాలను, సీసాల మూత లను తీసుకొచ్చి ఆ సీసాల్లో నకిలీ మద్యం నింపి విక్రయిస్తున్నారు.
తక్కువ ధరకే మద్యం పేరుతో ఆర్డర్లు తీసుకుని ఖాళీ బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆకుల అజయ్ కుమార్ కస్టమర్ల నుంచి అర్డర్లు తీసుకుం టాడని, మిగిలిన నలుగురు మద్యాన్ని తయారు చేసి కోరిన వారికి సరఫరా చేస్తారని ఎక్సైజ్ అధికారులు వివరించారు.
ఈ కేసులో కలకండా అనిల్ కుమార్, ఆకుల విజయ్, ప్రమోద్ మల్లిక్, జగ న్నాథ్ సాహులను అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు. ఉద్దవ్ నాయక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. రూ. 4.15 లక్షల విలువ చేసే మద్యాన్ని వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు.