తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Rural Road Problems: గ్రామాలకు రోడ్లు వేస్తేనే... ఓట్లు వేస్తామంటున్న గ్రామీణ ప్రజలు

Adilabad Rural Road Problems: గ్రామాలకు రోడ్లు వేస్తేనే... ఓట్లు వేస్తామంటున్న గ్రామీణ ప్రజలు

HT Telugu Desk HT Telugu

11 October 2023, 12:51 IST

google News
    • Adilabad Rural Road Problems: స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా,తెలంగాణలో తమ గ్రామాలకు మాత్రం స్వాతంత్రం రావడం లేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. దశాబ్దాల కాలం మారుతున్నా, తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డల తలరాతలు మార్చే తీరిక పాలకులకు లేదని ఆవేదన చెందుతున్నారు. 
గంగాపూర్ వెళ్లే దారిలో కడం వాగుపై తెప్పలో వెళ్తున్న  ప్రజలు
గంగాపూర్ వెళ్లే దారిలో కడం వాగుపై తెప్పలో వెళ్తున్న ప్రజలు

గంగాపూర్ వెళ్లే దారిలో కడం వాగుపై తెప్పలో వెళ్తున్న ప్రజలు

Adilabad Rural Road Problems: ఉమ్మడి ఆదిలాబాద్ లోని, నిర్మల్ జిల్లా, కడం మండలం గంగాపూర్ , వస్పెల్లి, దొందారి గ్రామాలకు నేటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో గంగాపూర్ గ్రామ పంచాయితీలో 12 గ్రామాలు అనుసంధానంగా ఉన్నాయి. పంచాయతీ పరిధిలో సుమారు 3000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.

అత్యధికంగా ఆదివాసీ గోండులు ఉండే ఈ ప్రాంతంలో కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. కడం నది అవతలి వైపు ఉండే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే, మరోవైపు నుంచి వెళ్లాలన్న దట్టమైన అడవుల గుండా వెళ్లాల్సిందే, ఈ ప్రాంత వాసుల బాధలు గమనించి అప్పటి ఈ సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారి ప్రస్తుత అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ఈ ప్రాంతానికి మట్టి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశారు.

పోలీసు శాఖ వారిచే ఈ రోడ్డు సౌకర్యం ఏర్పడటంతో ఆ శాఖ తరపున అధికారికి అమెరికాలో అవార్డు సైతం అందజేశారు. అయితే అట్టి రోడ్డు ను తారు రోడ్డు గా మార్చాల్సిన ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికి పట్టించుకోవడం లేదు. మట్టి రోడ్డును సుమారు 20 సంవత్సరాల క్రితమే నిర్మించినా నేటికీ బిటి రోడ్డుగా మారలేదు. ప్రతి వర్షాకాలం సీజన్లో గుట్టల నుంచి వరదలు రావడం రోడ్డు కొట్టుకపోవడం సర్వ సాధారణమైంది.

ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పసుపుల, గంగాపూర్ గ్రామాలకు నాలుగేళ్ల క్రితమే వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు, అయితే పనులు పిల్లర్ల మటుకే పరిమితం అయ్యాయి. వర్షాకాలం భారీ వరదలు రావడంతో వంతెనలో కొంత భాగం కొట్టుకొని పోయింది. పనులు నాసి రకంగా నిర్మించడంతోనే వంతెన కొట్టుకపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పర్సెంటేజీల కోసం కాంట్రాక్టర్ ని వేధించడంతో పనులు నాసిరకంగా చేశారని, అక్కడికి గ్రామస్తులు జిల్లా కేంద్రంలో ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎన్నికలను బహిష్కరిస్తాం…

తమ గ్రామాలకు రోడ్లు వేయడం లేదని, వేసే వరకు ఎన్నికలను బహిస్కరిస్తామని గంగాపూర్ గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ఎన్నికలు రాగానే నాయకులు వస్తారని, అనంతరం మర్చిపోతారని అన్నారు. ఎన్నో ఎళ్లుగా అటవీ ప్రాంతం లో నివాసం వుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, తమను పట్టించుకోనే వారే లేరని తెలిపారు.

అడవుల్లో విసిరేసినట్లుండే మా గ్రామాల్లో అటవీ జంతువుల భయంతో జీవితం నెట్టుకొస్తున్నామని చెప్పారు. వంతెన లేకపోవడం తో తెప్పలపై వెళ్లి వస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య చదువడానికి మా విద్యార్థులు వెనకబడి పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో పార్టీలు హామీలు ఇచ్చారు గాని, తమకైతే ఎలాంటి ఉపయోగం కాలేదని తెలిపారు.

రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబార్

తదుపరి వ్యాసం