తెలంగాణ: బహుముఖ పేదరిక సూచీలో ఆదిలాబాద్‌కు ఒకటో స్థానం
24 January 2022, 20:51 IST
- Poverty Index: నీతి ఆయోగ్ రూపొందించిన బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్)లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ జిల్లాలో పేదరికం ఎక్కువగా ఉంది. పేదరికం అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ నిలిచాయి.
ప్రతీకాత్మక చిత్రం : దేశంలో పేదరికం అనుభవిస్తున్న ప్రజలు (pc: varun tondon, unsplash)
రాష్ట్రంలో విభిన్న రంగాల్లో 13.74 శాతం మంది పేదరికాన్ని అనుభవిస్తున్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 ను బేస్ లైన్‌గా తీసుకుని ఈ నివేదికను రూపొందించిన నీతిఆయోగ్ 2021, నవంబరు 26న ఆవిష్కరించింది.
కేవలం ఆదాయం ప్రాతిపదికన కాకుండా విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు తదితర మూడు కేటగిరీలను ఎంచుకుని, వీటిలో విభిన్న సూచీలకు స్కోర్ కేటాయించింది. ఆరోగ్యంలో పౌష్ఠికాహారం, శిశు, కౌమారదశ మరణాలు, శిశు ఆరోగ్యం సూచీలను, అలాగే విద్యలో పాఠశాల సంవత్సరాలు, పాఠశాల హాజరు సూచీలను పరిగణనలోకి తీసుకుంది.
జీవన ప్రమాణాలలో వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, నివాస గృహం, ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలు తదితర సూచీలను కూడా పరిగణనలోకి తీసుకుంది.
తెలంగాణలో అంశాల వారీగా పేదరికం ఎదుర్కొంటున్న జనాభా శాతం
ఏ జిల్లాలో ఎక్కువ పేదరికం ఉంది?
తెలంగాణలో మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ప్రకారం అత్యంత ఎక్కువగా పేదరికం ఉన్న జిల్లాలు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ. ఏ జిల్లాలో ఎంత పేదరికం ఉందో కింది పట్టికలో చూడవచ్చు.