Adilabad Low Temperatures : ఆదిలాబాద్ ఏజెన్సీలో మంచు దుప్పటి- రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
16 December 2024, 19:56 IST
Adilabad Low Temperatures : ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని తలపిస్తుంది. ఉత్తరాది చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో అత్యల్ప స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ ఏజెన్సీలో మంచు దుప్పటి- రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
Adilabad Low Temperatures : ఎముకలు కొరికే చలికి తోడు ఏజెన్సీలో దట్టమైన మంచు దుప్పటి ఆవహించుకుంది. వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దట్టమైన మబ్బులతో వాతావరణం చీకటిమయం కాగా ఉట్నూర్, నార్నూర్, తిర్యాని, కెరమెరి, ఆసిఫాబాద్, జైనూర్ మండలాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. మరో వారం రోజులపాటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమరంభీం జిల్లాలో ఇదే స్థాయిలో శీతల గాలులు వీస్తాయని చలి తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా అతి శీతల పవనాలతో మరో కాశ్మీరాన్ని తలపిస్తుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో ఈదురు గాలులు, రాష్ట్రంలోనే అత్యల్ప స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి, తెల్లవారుజామున గడ్డ కట్టే చలిలో జనం అవస్థలు వర్ణనాతీతం..చలి తీవ్రతతో ప్రజలు రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలిమంటలు సాధారణంగా కనిపిస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు చలికి ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. జిల్లా వాసులు ఈ పరిస్థితులను తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు, చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు, చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఈదురు గాలులతో పాటు రాష్ట్రంలోనే అత్యల్ప స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉదయం వేళల్లో గడ్డ కట్టే చలిలో జనం అవస్థలు పడుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా బేల మండల కేంద్రంలో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతుంది. ఆదిలాబాద్ జిల్లా లోని 4మండలాలు, నిర్మల్ జిల్లాలోని 3 మండలాలు కొమరరంభీం జిల్లాలోని తొమ్మిది మండలాల్లో రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. శీతలగాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు.
ఏజెన్సీలో గిరిజనులు, ప్రతిరోజు పట్టణాల్లో కూరగాయలు పాలు అమ్ముకునే సాధారణ రైతులు, పారిశుద్ధ్య కార్మికులు, బస్టాండ్ రైల్వే స్టేషన్లో యాచకుల పరిస్థితి దెన్యంగా మారుతుంది. కశ్మీర్ తరహాలో చలిగాలుల నేపథ్యంలో పిల్లలు వృద్ధులు వణికిపోతున్నారని, అనారోగ్య సమస్యలు క వాడ తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దగ్గు, జలుబు, చలిజ్వరం శ్వాస సంబంధ వ్యాధులు ఈసమయంలోనే ప్రభావం చూపుతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి : నిపుణులు
చలి తీవ్రత నేపథ్యంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. దట్టంగా కమ్మేసే పొగ మంచు, అతి శీతల పవనాల నేపథ్యంలో వృద్ధులు పిల్లలు అతి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్.. శీతల గాలులకు తోడు కనిష్ట ఉష్ణోగ్రతలతో ఏజెన్సీ ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో వారం రోజుల్లో 5 నుండి 3 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోద యింది. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో 8.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా తపాలాపూర్ లో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.